Ap News: రాష్ట్రంలో విజృంభిస్తున్న జ్వరాలు.. మంత్రి కీలక ఆదేశాలు

by srinivas |
Ap News: రాష్ట్రంలో విజృంభిస్తున్న జ్వరాలు.. మంత్రి కీలక ఆదేశాలు
X
  • జ్వరాల‌పై అప్రమ‌త్తంగా ఉండండి..
  • ఇంటింటి స‌ర్వే చేయించండి
  • అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జ్వరాల‌కు ప్రత్యేక ఓపీ
  • సంబంధిత డాక్టర్లు అంతా అందుబాటులో ఉండాలి
  • సీజ‌న్ మారుతున్న నేప‌థ్యంలో జాగ్రత్తలు అవ‌స‌రం
  • కొద్ది రోజులే ఈ స‌మ‌స్య
  • ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలే కీల‌కం
  • జ్వరాల‌తో బాధ‌ప‌డుతున్న వారిని గుర్తించి ప‌ర్యవేక్షించండి
  • రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని
  • జ్వరాల తీవ్రత నేప‌థ్యంలో అధికారుల‌తో జూమ్ ద్వారా ప్రత్యేక స‌మావేశం

వైర‌ల్ జ్వరాలు ప్రభావం చూపుతున్న నేప‌థ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులంతా అప్రమ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశించారు. కొద్ది రోజులుగా జ్వరం, జ‌లుబు, ద‌గ్గు ల‌క్షణాలు ప్రజ‌ల్లో క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ఆమె వైద్య ఆరోగ్యశాఖ అధికారుల‌తో ఆమె జూమ్ స‌మావేశం ద్వారా స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సీజ‌న్ మారుతున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే వైర‌ల్ జ్వరాలు ప్రభావం చూపుతూ ఉంటాయ‌ని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే ప‌రిస్థితి క‌నిపిస్తున్నద‌ని చెప్పారు. ఈ జ్వరాల విష‌యంలో వైద్య శాఖ అప్రమ‌త్తంగా ఉండాల‌ని చెప్పారు. జ్వర తీవ్రత అధికంగా లేద‌ని, ఎక్కడా ఆందోళ‌న చెందాల్సిన ప‌రిస్థితులు లేవ‌ని తెలిపారు. అయినా స‌రే వైద్య సిబ్బంది ఇంటింటి స‌ర్వే నిర్వహించాల‌ని ఆమె ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు ఫీవ‌ర్ స‌ర్వే

ప్రజ‌లకు ఆరోగ్యం విష‌యంలో ఏ చిన్న స‌మ‌స్య రాకుండా జ‌గ‌న‌న్న కృషి చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. ఇప్పుడు సీజ‌నల్ జ్వరాల విష‌యంలోనూ ముఖ్యమంత్రి ప‌లు ఆదేశాలు జారీ చేశార‌ని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఫీవ‌ర్ సర్వే చేయాల‌ని ముఖ్యమంత్రి చెప్పార‌ని తెలిపారు. ఏఎన్ఎంలు, ఎంఎల్ హెచ్‌పీలు ఇంటింటికీ వెళ్లి జ్వరాల‌తో బాధ‌ప‌డుతున్నవారిని గుర్తించాల‌ని, వారికి అవ‌స‌ర‌మై వైద్య స‌దుపాయం అందించాల‌ని చెప్పారు. ఎవ‌రిలో అయిన తీవ్ర ల‌క్షణాలు ఉంటే.. జిల్లా, బోధ‌నా స్పత్రుల‌కు రోగుల‌ను పంపాల‌ని తెలిపారు. సీహెచ్‌సీల స్థాయి నుంచి బోధ‌నా స్పత్రుల వ‌ర‌కు అన్ని ఆస్పత్రుల్లో జ్వరాల‌కు వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైతే ప్రత్యేక ఓపీని అందుబాటులోకి తేవాల‌న్నారు. ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగే వ‌ర‌కు అధికారులు సెల‌వులు తీసుకోవ‌ద్దని సూచించారు.


పిల్లల‌కు జ్వరం ఉంటే బ‌డికి పంపొద్దు

ముఖ్యంగా పాఠ‌శాల విద్యార్థుల్లో జ్వరం ల‌క్షణాలు క‌నిపిస్తే... బ‌డికి పంపొద్దని మంత్రి చెప్పారు. ఈ స‌మ‌స్య పాఠ‌శాలల్లో ఎక్కవ‌గా క‌నిపిస్తోంద‌ని నివేద‌క‌లు వ‌స్తున్నాయ‌ని, పిల్లలు ఎవ‌రైనా అస్వస్థత‌కు గురైతే ప్రాధానోపాధ్యాయులు బాధ్యతగా తీసుకుని వారికి సెల‌వులు మంజూరు చేయాల‌ని సూచించారు. ఉత్తర భార‌తంలో హెచ్3ఎన్2 వైర‌స్ కొంత ప్రభావం చూపుతోంద‌ని, ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆ ప‌రిస్థితులు లేవ‌ని వివ‌రించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూడాల‌ని ఉన్నతాధికారుల‌ను కోరారు. రక్త ప‌రీక్షలు, ఇత‌ర వైద్య ప‌రీక్షలు అన్ని స‌జావుగా జ‌రిగేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్ల స్థాయి వ‌ర‌కు అందుబాటులో ఉండేలా చూడాల‌న్నారు.

జాగ్రత్తలు అవ‌స‌రం

మంత్రి మాట్లాడుతూ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ జ్వరాల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చని చెప్పారు. శానిటైజ‌ర్ వాడాల‌న్నారు. ప‌రిశుభ్రత పాటించాల‌ని, పౌష్టికాహారం తీసుకోవాల‌ని వివ‌రించారు. వేస‌విలో వ‌డ దెబ్బ న‌ష్టాల‌పై కూడా అప్రమ‌త్తం ఉండాల‌ని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యద‌ర్శి ఎం.టి.కృష్ణబాబు, క‌మిష‌న‌ర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్‌, డీఎంఈ వినోద్‌కుమార్‌, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రామిరెడ్డి, అన్ని బోధ‌నాస్పత్రుల సూప‌రింటెండెంట్‌లు, డీఎంఅండ్‌హెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లు, ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed