- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒకే ఒక డైలాగ్‌తో ఫుల్‌స్టాప్ .. అదంతా లోకేశ్ వ్యూహమా?
దిశ, డైనమిక్ బ్యూరో: నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసం జూ.ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు. నందమూరి వారసులను రాజకీయాల్లోకి రాకుండా.. ముఖ్యంగా టీడీపీలో చేరకుండా పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం జూ.ఎన్టీఆర్ నామం జపిస్తుంది. తారక్‌తోనే టీడీపీ బతికిబట్టకడుతుందని చెప్తోంది. అయితే తారక్ వస్తే లోకేశ్ పని క్లోజ్ అని అందువల్లే చంద్రబాబు తారక్‌ను దూరం పెడుతున్నారనే ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
ఒక్క డైలాగ్‌తో లోకేశ్ ఫుల్ స్టాప్
అయితే వాటన్నింటికి ఒకే ఒక డైలాగ్‌తో లోకేశ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. తారక్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తానంటే తాము రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉంచామని చెప్పుకొచ్చారు. అంతేకాదు సమాజంలో మార్పు తీసుకురావాలన్నా..గుడ్ గవర్నెన్స్ తీసుకురావడానికి వాళ్లను రాష్ట్రాభివృద్ధి కోసం ఆహ్వానిస్తున్నట్లు లోకేశ్ చెప్పుకొచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో తారక్ ప్రవేశానికి రూట్ క్లియర్ అయ్యిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు ఇక తారక్ వల్లే టీడీపీ బలోపేతం అవుతుందని గ్రహించారని అందుకే తారక్ జపం చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తారక్‌ను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్లు లోకేశ్ ప్రకటించడంతో తారక్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు మాంచి జోష్‌లో ఉన్నారు.
లోకేశ్ వ్యూహాత్మకం
తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేశ్ ఇతర నేతలు పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కలిసివచ్చే ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. రాష్ట్రంలో ఒకవైపు జనసేన పార్టీతో పొత్తుకోసం టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పవన్ కల్యాణ్, చంద్రబాబులకు సత్సంబంధాలు సైతం ఉన్నాయి.
మరోవైపు అన్ స్టాపబుల్ షో ద్వారా నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు ఒకే వేదికపై కనిపించడం ఇక పొత్తుకు ఎంతో దూరం లేదనే వార్తలు వినిపించాయి. జనసేనతో పొత్తులో చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతుంటే లోకేశ్ మాత్రం యువగళంతో ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేందుకు యత్నిస్తున్నారు. అంతేకాదు లోకేశ్ వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తున్నారు. జూ.ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. జూ.ఎన్టీఆర్‌లాంటి వాళ్లు వస్తే రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని గుడ్ గవర్నెన్స్ తీసుకురావొచ్చంటూ లోకేశ్ కితాబిచ్చారు.
జూ.ఎన్టీఆర్‌కు లోకేశ్ ఆహ్వానం
యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతి అంకుర హాస్పటల్ సమీపంలోని ప్రాంగణంలో హాలో లోకేష్ పేరుతో యువతీయువకులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా రాజకీయాల్లో జూ.ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌లను ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు లోకేశ్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘నూటికి నూరుశాతం స్వాగతిస్తాం. రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ముందుకొచ్చేవారిని టీడీపీ ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. మంచి మనసున్నవాళ్లు వస్తే రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చు. పవన్ కళ్యాణ్‌ను 2014లో తాను మొదటిసారిగా కలిశాను. ఏపీలో మంచి ప్రభుత్వం, ఏపీలో మంచి మార్పు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్లకు తాము రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉంచాం. సమాజంలో మార్పు తీసుకురావాలన్నా, గుడ్ గవర్నెన్స్ తీసుకురావడానికి వాళ్లను రాష్ట్రాభివృద్ధి కోసం ఆహ్వానిస్తున్నాను’ అంటూ లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమాధానంతో జూ.ఎన్టీఆర్‌కు టీడీపీలో ఎప్పుడూ ప్రాధాన్యతే ఉంటుందని తాము ఆయనను తొక్కేస్తున్నామంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని లోకేశ్ తేల్చి చెప్పేశారు.
నిర్ణయం తారక్ దే
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బావ అయిన నారా లోకేశ్ ఆహ్వానంపై జూ.ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల కాంపైన్ చేశారు. ఆ తరువాత పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలోకి తీసుకురావాలని డిమాండ్ అటు టీడీపీలోనూ ఇటు అభిమానుల్లోనూ ఉంది. కానీ లోకేశ్ కారణంగానే పార్టీలో జూ.ఎన్టీఆర్‌కు అవకాశం దక్కటం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై అటు జూ.ఎన్టీఆర్ కానీ ఇటు చంద్రబాబు ఫ్యామిలీ కానీ స్పందించలేదు. అయితే వ్యూహాత్మకంగా లోకేశ్ వ్యవహరించారు. తారక్‌కు వెల్‌కమ్ చెప్తూ పొలిటికల్ బంతిని తారక్ కోర్టులోకి నెట్టేశారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ కాకకోసం రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉందని ప్రకటించేశారు.
వచ్చే ఎన్నికల్లో తారక్ కీలకంగా మారతారా?
దీంతో ఇప్పుడు నిర్ణయం తారక్‌పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్న జూ.ఎన్టీఆర్ మరి రాజకీయాల కోసం.. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు అందుకు చాలా సమయం ఉందంటూ దాటవేస్తూ వచ్చిన తారక్ మరి బావ ఆహ్వానం మేరకు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారతారా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ తారక్ సై అంటే మాత్రం అటు పవన్ కల్యాన్..ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరితో కలిసి ఎన్నికల సమరంలో గెలుపొందాలని టీడీపీ వేస్తున్న ప్లాన్ సక్సెస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Ap News: జూ.ఎన్టీఆర్‌ను ఆహ్వానించడానికి లోకేశ్ ఎవరు?