పోలీస్ స్టేషన్‌లో నేలపై కూర్చున్న మాజీమంత్రి.. ఫొటో వైరల్

by samatah |
పోలీస్ స్టేషన్‌లో నేలపై కూర్చున్న మాజీమంత్రి.. ఫొటో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ తీరును నిరసిస్తూ మాజీమంత్రి జవహర్, ఇతర టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాజీమంత్రి జవహర్‌ను అరెస్ట్ చేసి రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో మాజీమంత్రి జవహర్‌ మరో టీడీపీ నేతతో కలిసి నేలపై కూర్చుని ఉన్నారు. జవహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నేలపై కూర్చొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో తన పట్ల పోలీసులు అధికారులు దురుసుగా ప్రవర్తించారని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జవహర్ డిమాండ్ చేసిన మరో వీడియో విడుదలైంది. స్టేషన్‌ సీఐ తనపై దాడికి పాల్పడ్డారని.. తీవ్ర పదజాలంతో దూషించారని జవహర్‌ ఆరోపించారు. ఒక గంజాయి స్మగ్లర్‌, గజ దొంగను చూసినట్టు.. పోలీసులు తనను చూశారని.. తనతో నీచంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై కేసు నమోదుచేసే వరకూ కదిలేది లేదంటై అక్కడే భీష్మించుకు కూర్చున్నారు జవహర్‌. ఆయనతో పాటు టీడీపీ బీసీ సెల్‌ నాయకుడు కేతా శ్రీనివాస్‌ కూడా నేలపై కూర్చుని నిరసన తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక మాజీమంత్రిని ఇంతలా అవమానిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మాజీ మంత్రి జవహర్ ని పోలీసులు నేలపై కూర్చోబెడతారా?


వైసీపీ పాలనలో దళితులకు అడుగడుగునా, అన్యాయం, అవమానం జరుగుతోంది. టీడీపీ నేత, మాజీమంత్రి కేఎస్ జవహర్ పట్ల అనపర్తి పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె్న్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జవహర్‌ను అరెస్ట్ చేసి ఆయన ఫోన్, పర్సు లాక్కుని నేలపై కూర్చోబెట్టడంపై మండిపడ్డారు. మాజీ మంత్రిని పోలీస్ స్టేషన్లో నేలపై కూర్చోబెట్టి అవమానిస్తారా? దళితులంటే జగన్ కి ఎందుకంత చిన్నచూపు ? మీ పాలనలో దళితులు కనీసం కుర్చీపై కూర్చోవడానికి కూడా అర్హులు కాదా ? జగన్ వైసీపీ దళిత నేతల్ని తన ఇంటి గుమ్మం బయట నిల బెడుతున్నారు. టీడీపీ దళిత నేతల్ని పోలీసు స్టేషన్లలో నేలపై కూర్చోబెడుతున్నారు. ఇది యావత్ దళిత జాతికి అవమానం. జవహర్‌ను అవమానించిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

జవహర్‌కు జగన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి: యనమల రామకృష్ణుడు

'రాష్ట్రంలో కొంతమంది పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ మానవ హక్కులను హరిస్తున్నారు. రాజకీయ కక్షలో భాగంగా మాజీ మంత్రి జవహర్‌ను, ఆయన సతీమణి, పిల్లలను పరుష పదజాలంతో దూషించడం పోలీసుల దుశ్చర్యలకు తార్కాణం' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. 'కనీసం ఓ మాజీ మంత్రి అనికూడా చూడకుండా సీఐ శ్రీనివాస్, డీఎస్పీ భక్తవత్సలంఅమానుషంగా ప్రవర్తించడం దారుణం. అన్ని రోజులు ఒకలా ఉంటాయని పోలీసులు భ్రమపడుతున్నట్లు ఉన్నారు. ఈరోజు రేపులా ఉండదు అనే సత్యాన్ని గుర్తించండి. అధికారం శాశ్వతం కాదు. కుల దురహంకారంతో అధికారాన్ని అడ్డదిడ్డంగా వాడుతున్న జగన్ రెడ్డి, ఆయన వందిమాగాదులను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే ఇబ్బందులు పాలవుతారు. జవహర్‌ని నేలపై కూర్చోబెట్టి అవమానించిన జగన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి అని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed