Dhavaleswaram Barrage:గోదావరి ఉగ్రరూపం..ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Jakkula Mamatha |
Dhavaleswaram Barrage:గోదావరి ఉగ్రరూపం..ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ ప్రతినిధి,కాకినాడ:భారీ వర్షాలు, ఎగువ నుంచి ఉధృతంగా వస్తున్న వరదల వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ధవళేశ్వరం సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను జల వనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 10.12 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర జలాల్లోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బ్యారేజ్ గేట్‌లో ఇరుక్కుపోయిన బోటు..

వరద ప్రవాహానికి గాయత్రి ఇసుక ర్యాంపు నుంచి ఇసుకతో నిండిన పడవ కొట్టుకొచ్చింది.బ్యారేజీ మొదటి గేటును ఢీ కొట్టి అక్కడే పడవ చిక్కుకుపోయింది. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్‌లో ఇరుక్కుపోయిన బోటు తొలగింపుపై అధికారులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం భారీ క్రేన్ ద్వారా బోటును తొలగించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. బోటు తొలగింపు నేపద్యంలో ఉదయం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ పై వాహనాలు రాకపోకలు నిలిపివేసారు.

Advertisement

Next Story