జూ.ఎన్టీఆర్‌ను పక్కన పెట్టేశారా?

by Javid Pasha |   ( Updated:2023-01-11 12:34:58.0  )
జూ.ఎన్టీఆర్‌ను పక్కన పెట్టేశారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజకీయాల్లో రాణించాలంటే అంగబలం, ధన బలంతోపాటు పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబ రాజకీయ నేపథ్యం ఖచ్చితంగా ఉండాలి. అలాగే వీఐపీలతో బంధుత్వం కూడా చాలా కీలకం. ఒక రాజకీయ నాయకుడు గానీ ఒక పార్టీగానీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలను ఉపయోగించుకోవడం తరచూ జరుగుతుంది. అప్పటి వరకు సిల్వర్ స్క్రీన్‌పై మెరిపించిన నటీనటులు ఎన్నికలు వచ్చాయంటే చాలు రోడ్లపైకి వచ్చి ఓటర్లను తమ మాటలతో మైమరపింప చేస్తారు. అందుకే రాజకీయాలకు సినీమాకు అవినావభావ సంబంధం ఎప్పటికీ ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ క్లిష్టపరిస్థితుల్లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో అయితే ఇక కష్టమే అన్నట్లు అయిపోయింది. ఇక ఏపీలో అయితే పార్టీ కార్యకర్తలు స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో నడిపించే నాదుడే కరువయ్యాడు. వైసీపీ వేవ్‌ను చంద్రబాబు దాదాపు తట్టుకోలేకపోతున్నారని రాజకీయాల్లో ఒక ప్రచారం ఉంది. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నేతలు సైతం ఆ పార్టీనీ పట్టించుకోవడమే మానేశారు. వచ్చే ఎన్నికలే టీడీపీకి చావో రేవో అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలోని ఓ వర్గం... అధికార పార్టీలోని కొందరు నేతలు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలో కీలకం చేయాలని వాదిస్తూ వస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు పర్యటనలలో జై జూ.ఎన్టీఆర్ అంటూ నినదిస్తు్న్న సంగతి తెలిసిందే. తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు జూ ఎన్టీఆర్ రాకను స్వాగతిస్తుంటే చంద్రబాబు, లోకేశ్‌లు స్వాగతించడం లేదనే ప్రచారం జరుగుతుంది. లోకేశ్‌ కోసం తారక్‌ను పక్కన పెట్టేశారని ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత ప్రచారం జరుగుతున్నా అటు చంద్రబాబు గానీ ఇటు లోకేశ్‌గానీ మరోవైపు నందమూరి బాలకృష్ణ గానీ ఖండించనూ లేదు సరికదా స్పందించనూ లేదు. కనీసం ఎన్టీఆర్‌ను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నమే చేయడం లేదన్నది రాజకీయాల్లో తరచూ వినిపిస్తున్న గాసిప్స్.

బర్త్ డే విషెస్ చెప్పని బాబు

తెలుగుదేశం పార్టీ కష్టసమయాల్లో తాను అండగా ఉంటానని.. ప్రస్తుతం తాను టీడీపీలోనే ఉన్నట్లు జూ.ఎన్టీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఇప్పుడు కదా దాదాపు దశాబ్ధకాలం క్రితం ప్రకటించారు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్‌ను ఉపయోగించుకోవడంలో టీడీపీ విఫలమైందని ప్రచారం ఉంది. కావాలనే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అభిమానులు, టీడీపీ నేతలు కోరుతున్నా... పార్టీ కోసం తాను కష్టపడతానని తారక్ గతంలోనే ప్రకటించినా ఇలాంటి కష్టసమయాల్లో ఉపయోగించుకోవాల్సింది పోయి తారక్‌ను ఎందుకు తీసుకురావడం లేదనే ప్రశ్న ఆ పార్టీలోనే కొత్త చర్చకు తెరలేపుతుంది. వాస్తవానికి చంద్రబాబు, లోకేశ్‌, బాలయ్యలు తారక్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో వీరికి సత్సంబంధాలు లేవని కొందరు ఉన్నాయని మరికొందరు చెప్తూ వస్తున్నారు. అందుకు కారణాలు సైతం లేకపోలేదు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం మే 20 అయితే ఆరోజు కనీసం చంద్రబాబు బర్త్ డే విషెస్ చెప్పలేదు. టీడీపీ గల్లీ లీడర్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తారక్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

తారక్‌ను కోట్ చేయకపోవడంపై చర్చ

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు...' గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడంతో దేశమంతా కాదు ప్రపంచమంతా తారక్‌‌ను ప్రశంసిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ దగ్గర నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ వరకు అంతా ట్వీట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇలా ప్రముఖులు అంతా ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలుపుతూనే జూనియర్ ఎన్టీఆర్‌ను కోట్ చేసి మరీ అభినంనదలు తెలియజేస్తున్నారు. అయితే చంద్రబాబు, లోకేశ్, బాలయ్య మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఎక్కడ కూడా తారక్‌ను కోట్ చేయలేదు. ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణిలను కోట్ చేశారు నాటు నాటు సాంగ్, ఆర్ఆర్ఆర్ మూవీ ట్యాగ్ చేశారే తప్ప కనీసం తారక్‌గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే బంధువులు అయిన చంద్రబాబు, లోకేశ్, బాలయ్యలు కోట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ తారక్ మాత్రం వారి ట్వీట్‌లకు స్పందించారు. థాంక్యూ మావయ్య అంటూ చంద్రబాబుకు సమాధానం ఇచ్చారు. అలాగే నందమూరి బాలకృష్ణ, లోకేశ్‌ల ట్వీట్‌కు కూడా థ్యాంక్స్ చెప్పారు తారక్.

కావాలనే తారక్‌ను సైడ్ చేశారా?

ప్రస్తుతం వైసీపీ వేవ్ నడుస్తోంది. అటు టీడీపీతో పొత్తుకు బీజేపీ నై అంటుంది. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి తీసుకువస్తే పార్టీకి ఎంతోకొంత మైలేజ్ వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తారక్ ప్రస్తుతం తాను సినిమాలపై ఫోకస్ పెట్టానని పైకి చెప్తున్నప్పటికీ పార్టీ కోసం అవసరమైతే తన సేవలు అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో అయినా తారక్‌ను దగ్గర చేర్చుకుంటే వచ్చే ఎన్నికల కాంపైన్‌లో అయినా ప్రచారానికి ఉపయోగపడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిని పరిశీలిస్తే తారక్‌ను కావాలనే చంద్రబాబు, లోకేశ్‌, బాలయ్యలు పక్కన పెడుతున్నారని వాదన బలంగా వినిపిస్తుంది. అంతేకాదు ఇలాంటి చర్యలు కూడా అందుకు నిదర్శనమని చెప్తున్నారు. గల్లీలీడర్‌కు చెప్పిన బర్త్ డే విషెస్ బంధువుకు చెప్పకపోవడం... సినిమా డైరెక్టర్‌కు, సినిమా సంగీత దర్శకుడుకు చెప్పిన విశెష్ తన కుటుంబ సభ్యులు అవార్డు పొందిన నేపథ్యంలో అభినందనలు ప్రత్యేకంగా చెప్పకపోవడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు టీడీపీకి తారక్‌ను దూరం చేస్తాయే తప్ప దగ్గరకు చేయవని ప్రచారం జరుగుతుంది. మరి దీన్ని టీడీపీ ఎలా సమర్థించుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

Next Story