స్వచ్ఛందంగా తప్పుకుంటా.. వీఆర్ఎస్ కు ప్రవీణ్ ప్రకాశ్ దరఖాస్తు

by Mahesh |   ( Updated:2024-07-07 03:14:21.0  )
స్వచ్ఛందంగా తప్పుకుంటా.. వీఆర్ఎస్ కు ప్రవీణ్ ప్రకాశ్ దరఖాస్తు
X

దిశ ప్రతినిధి, గుంటూరు: వైసీపీ ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా, విద్యాశాఖ కార్యదర్శిగా ఓ రేంజ్ లో రెచ్చిపోయిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. 1994వ ఆంధ్ర ప్రదేశ్ బ్యాచ్ కు చెందిన ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడంతో తన వ్యవహారాలపై విచారణలు, క్రమశిక్షణ చర్యలు తప్పవన్న భయంతో ఈ నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీఆర్ఎస్ కు సంబంధించి తన లేఖను సమర్పించారు. ఆ లేఖలో రానున్న సెప్టెంబర్ 30వ తేదీ తన పదవీ విరమణ తేదీగా స్వీకరించాలని కోరారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పలు కీలక పదవులు అనుభవించిన ఆయన తనకంటే సీనియర్లను కూడా లెక్క చేయకుండా తరచూ వార్తల్లో నిలిచేవారు. జగన్ పాలన ప్రారంభమైనపుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను అవమానించి ఆ పదవి నుంచి గెంటించడంలో ప్రవీణ్ ప్రకాష్ కీలక పాత్ర పోషించారని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ సాగింది. అప్పుడు కేంద్ర సర్వీసులో ఉన్న నీలం సహానిని రప్పించి ఎల్వీని తప్పించారు. ఈ ఎపిసోడ్ లో ప్రవీణ్ ప్రకాష్ ప్రధాన పాత్ర పోషించారు. జూనియర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ లతోపాటు తనకు నచ్చని అధికారులందరినీ వేధించారని అప్రతిష్ట మూట కట్టుకున్నారు. ఇవన్నీ జగన్ కు తెలిసి సీఎంవో నుంచి తప్పించి ఢిల్లీకి పంపారు. కొద్ది రోజులు అక్కడ విధులు నిర్వహించి తిరిగి జగన్ ను ప్రసన్నం చేసుకుని రాష్ట్రానికి వచ్చి ఉన్నత విద్యా శాఖను ఏలారు.

విద్యాశాఖ కార్యదర్శిగా వివాదాలు..

విద్యాశాఖలో కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయనకు అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు పడ్డారు. తనిఖీల పేరిట ఉపాధ్యాయులకు తీవ్ర వేధింపులకు గురి చేశారు. ప్రవీణ్ ప్రకాష్ తన పాఠశాలకు తనిఖీకి వస్తున్నారంటే చాలు ఉపాధ్యాయులకు దడ వచ్చేది. అర్థంపర్థం లేని నిబంధనల పేరిట అవమానాలకు గురిచేశారు. విసిగిపోయిన ఉపాద్యాయులు చివరకు ప్రవీణ్ ప్రకాశ్ కు వ్యతిరేకంగా ఉద్యమం ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టారు. ఆయన ఆ శాఖలో వుంటే పనిచేయలేమని స్పష్టం చేశారు. విద్యాశాఖకు సంబంధించి పుస్తకాలు, బ్యాగ్ ల కొనుగోళ్లలో అక్రమాలకు, అవినీతికి కూడా ప్రవీణ్ ప్రకాష్ కారణమనే ఆరోపణలు వచ్చాయి.

అర్ధరాత్రి జీవోలు..

ముఖ్యమంత్రి పేషీ అధికారిగా వున్న సమయంలో ప్రవీణ్ ప్రకాష్ అర్ధరాత్రి అమరావతి సచివాలయంలో వాకింగ్ చేస్తూ జీవో లు డిక్టేట్ చేసేవారనే ఆరోపణలు వచ్చాయి. ఆయన వాకింగ్ చేస్తుంటే కింది స్థాయి అధికారులు ల్యాప్ ట్యాప్ పట్టుకొని ఆయన వెంట వెళ్లి ఆయన చెప్పింది నోట్ చేసుకుని జీవో ఇవ్వాల్సి వచ్చేదంటే ఆయన హవా ఎంతగా చలామణి అయిందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్ వీ సుబ్రహ్మణ్యం ను ప్రవీణ్ ప్రకాష్ లెక్క చేయలేదు. ఆయన ఇవ్వాల్సిన జీవో‌లను కూడా ఈయనే ఇచ్చేసి కొత్త వివాదాలు రాజేశారు. ముఖ్యమంత్రి పేషీ లో ప్రవీణ్ ఉన్నారనే కారణంగా పలువురు సీనియర్ ఐఏఎస్ లు ఆ పరిసరాలకు వెళ్లాలంటేనే సందేహించేవారు.

వాణిజ్య పన్నుల శాఖాధికారి మరణానికి కారణం..?

గుంటూరులో వాణిజ్య పన్నుల శాఖాధికారిణి గా పని చేస్తున్న టీకే రమామణి తాను చెప్పిన పనులు చేయలేదన్న కోపంతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా కూడా పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ వేధింపులకు గురిచేశారు. సున్నిత మనస్కురాలైన ఆమె కరోనా సమయంలో టెన్షన్ కు గురై అనారోగ్యం పాలై మరణించారు. నిజాయితీ అధికారిగా పేరున్న ఆమె ప్రవీణ్ ప్రకాష్ నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యారంటూ సహచరులు, బంధుమిత్రులు విమర్శించారు.

Advertisement

Next Story