- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘చదువులో మతం తీసుకురావద్దు’.. విద్యాశాఖ మంత్రి ఆదేశం

దిశ, డైనమిక్ బ్యూరో / ఏపీ బ్యూరో : వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు దువ్వారపు రామారావు, పి.అశోక్ బాబు, బి.తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలు, చర్చ లేకుండా సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై రుద్దారన్నారు.
117 జీవోలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. బోధనలో సాంకేతికతను జోడిస్తామని తెలిపారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ కాన్సెప్ట్ ద్వారా 60 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే తరగతికో ఉపాధ్యాయుడిని కేటాయించి మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
చదువులో మతం తీసుకురావద్దు..
చదువులోకి మతం తీసుకురావద్దని మంత్రి లోకేశ్ కోరారు. కులం, మతం, ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. విద్యాశాఖపై రెండు గంటల చర్చ పెడితే ఎందుకు పారిపోయారని లోకేష్ నిలదీశారు.
విద్యా ప్రమాణాలు పడిపోయాయి..
వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మంత్రి లోకేష్ ఆరోపించారు. ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకం 2014లో 57శాతం మంది చదవగలిగితే, జగన్ రెడ్డి పాలనలో 37.5 శాతానికి పడిపోయినట్లు అసర్ నివేదిక వెల్లడించిందన్నారు. 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80శాతం మంది చదవగలిగితే, 2024కు వచ్చేనాటికి 53 శాతానికి పడి పోయిందన్నారు. 8వ తరగతి విద్యార్థులకు కనీసం 50 శాతం మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారని వివరించారు. 3వ తరగతి పిల్లలు 60 శాతం మంది బేసిక్ సబ్ ట్రాక్షన్ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 8వ తరగతి పిల్లలు 55 శాతం మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నట్లు అసర్ నివేదిక తేటతెల్లం చేసిందని మంత్రి లోకేష్ వెల్లడించారు.