Ap News: తుని బరిలో యనమల దివ్య?

by srinivas |   ( Updated:2023-02-04 14:11:32.0  )
Ap News: తుని బరిలో యనమల దివ్య?
X
  • ఇంచార్జిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం..
  • చక్రం తిప్పిన యనమల రామకృష్ణుడు..
  • గత నెలలోనే తేల్చి చెప్పిన దిశ డిజిటల్ ఎడిషన్..
  • ఉత్కంఠగా మారిన కృష్ణుడు ఫ్యూచర్..

దిశ, ఉభయగోదావరి: తుని రాజకీయం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన వ్యూహం ప్రత్యర్థులకు సైతం అర్ధం కాదు. మనిషి చాలా సాప్ట్‌గా ఉంటారు. మాటలు తక్కువ ఆలోచనలు ఎక్కువ. నిత్యం చురుకైన చూపులతో పెదవులపై చిన్న నవ్వుతో చూపుడు వేలు ముక్కు మీద వేసుకుని నిరంతరం ఆలోచనల పర్వంలో మునిగి తేలుతూ ఉంటారు. అప్పుడప్పుడు చంద్రబాబుకే సలహాలు ఇస్తూ ఉంటారు. పనిలో పనిగా తన రాజకీయ భవితవ్యం కోసం కూడా ఆలోశించుకుంటూ ఉంటారు. అందుకే పార్టీ అధికారంలో ఉంటే ఆర్థిక మంత్రి దాకా వెళతారు. ప్రతిపక్షంలో కనీసం ఎమ్మెల్సీ అయినా తీసుకుంటారు. అతనెవరో కాదు టీడీపీ దిగ్గజం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. తుని నియోజకవర్గంలో తన కుమార్తెను ఇంచార్జిగా ప్రకటించి అధిష్టానం వద్ద తన సత్తా నిరూపించుకున్నారు. తుని ఇంచార్జి విషయమై గత రెండు నెలల నుంచి స్థానికంగా జరుగుతున్న హైడ్రామాకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వీక్షకుల పొందుతున్న దిశ డిజిటల్ ఎడిషన్‌లో రెండు నెలల క్రితమే తుని ఇంచార్జిగా దివ్య పేరు ఖరారు కానున్నట్లు ప్రత్యేక కథనం ప్రచురితం అయ్యింది. ఈ కథనం పట్ల అప్పట్లో మల్లగుల్లాలు పడ్డారు. ఒక వర్గం వారు అయితే ఇది పుకారు వార్తని కొట్టిపారేశారు. ఎట్టకేలకు దిశ కథనం నిజం అని నిరూపణ అయ్యింది. ఈ నేపథ్యంలో తుని తాజా రాజకీయ పరిస్థితులపై దిశ అందిస్తున్న ప్రత్యేక కధనం.

గత రెండు నెలలుగా హైడ్రామా..

తుని టీడీపీ అభ్యర్థి విషయమై గత రెండు నెలలుగా హైడ్రామా కొనసాగింది. ఓ పక్కన యనమల కృష్ణుడా.? లేక యనమల దివ్య..? లేక మూడో వ్యక్తి ఎవరైనా రానున్నారా అనేది పెద్ద చర్చగా మారింది. ఒకానొక సందర్భంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కార్యకర్తల సమావేశం పెట్టి కృష్ణుడుకి టికెట్ ఇవ్వడం కష్టమేనని చెప్పడం జరిగింది. అక్కడ నుండే అస్సలు రాజకీయం ప్రారంభమైంది. మనసులోనే తీవ్ర బాధ పడ్డ కృష్ణుడు తన అంతరంగీకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో ఒక ఆడియో కూడా లీక్ అయ్యి కలకలం సృష్టించింది. యనమల రామకృష్ణుడు మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టి మా అన్నదమ్ముల మధ్య ఎటువంటి విభేదాలు లేవని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్షం కూడా మూడో వ్యక్తి రాకుండా డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు.

కృష్ణుడు భవితవ్యం ప్రశ్నార్థకం..

తాజా పరిణామాలపై గత రెండు పర్యాయాలుగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలవుతున్న యనమల కృష్ణుడు రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఆయన దివ్య నాయకత్వాన్ని వ్యతిరేకించారు. తన అన్న యనమల రామకృష్ణుడిని కూడా తెర వెనుక శత్రువుగా భావించారు. తాజా పరిణామాలలో దివ్యను ఇంచార్జిగా టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో కృష్ణుడు పరిస్థితి ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. బహుశా ఆయన పార్టీ మారతారని కొందరూ, సైలెంట్‌గా ఉండిపోతారని మరికొందరూ, తెర వెనుక ప్రత్యర్థి పాత్ర పోషిస్తారని ఇంకొందరూ ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం.

విశ్వసనీయతకు మారు పేరు దిశ డిజిటల్ ఎడిషన్..

తుని రాజకీయాలపై దిశ డిజిటల్ ఎడిషన్‌లో ప్రచురితమైన అనేక కథనాలు నేటికి వాస్తవం అయ్యాయి. పార్టీలో నెంబర్ 2 పాత్ర పోషిస్తున్న యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని కథనాలు వాస్తున్న క్రమంలో దిశ ఉభయగోదావరి ప్రతినిధి, తుని కంట్రిబ్యూటర్లకు చాలా ఒత్తిళ్లకు లోనైయ్యారు. అయితే వాస్తవాలు పాఠకులకు వివరించాలనే ప్రయత్నం ఎక్కడా ఆగలేదు. ఇందులో భాగంగానే దివంగత స్పీకర్ జి.యం.సి బాలయోగి తనయుడు హరీష్‌ను అమలాపురం బాధ్యతల నుండి తప్పిస్తారని అసెంబ్లీకి పరిమితం చేస్తారని ఒక కథనం ప్రచురితం అయ్యింది. ఇది కూడా నిజం అవుతూ గంటి హరీష్‌కు పి.గన్నవరం అసెంబ్లీ బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story