- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తారా?
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: గత ఎన్నికల సందర్భంగా నవరత్నాల పేరిట వైసీపీ ఇచ్చిన హామీలకు మంచి స్పందన లభించింది. అప్పట్లో జగన్ మాటలను జనం నమ్మి 151 సీట్లతో అధికారం అప్పగించారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు రైతులు సామాన్య జనం, ముఖ్యంగా మహిళలు జగన్ ను పూర్తిగా విశ్వసించారు. దానికి తగ్గట్టుగా నవరత్నాల అమలే తన తొలి ప్రాధాన్యత అని ఆయన ముఖ్యమంత్రి అవగానే ప్రకటించారు. సచివాలయంలో నవరత్నాల హామీలను తన ఛాంబర్ కు వెళ్లే గోడల మీద రాయించారు. వీటి అమలు ద్వారా బడుగు బలహీన వర్గాల వారితో పాటు మధ్య తరగతి వారికి కూడా ఊరట లభిస్తుందని, ప్రభుత్వ వేధింపులు తగ్గుతాయని అంతా భావించారు. అయితే, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
అమలు అట్టర్ ఫ్లాప్..
నవరత్నాలలో మొదటిది వైఎస్సార్ రైతు భరోసా, రెండోది ఫీజు రీయింబర్స్ మెంట్, నాల్గవది జలయజ్ఞం.. వీటి అమలు అంతంత మాత్రమే. రైతుకు సంవత్సరానికి 12,500 నుంచి లక్ష రూపాయల వరకు లబ్ధి జరుగుతుందని ప్రచారం చేసిన వైసీపీ కేంద్రం ఇచ్చే రైతు భరోసాకు కాస్త కలిపి ఇవ్వడం మినహా చేసిందేమీ లేదు. పైగా జగన్ హయాంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. పోలవరం తో సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని జలయజ్ఞంలో ఇచ్చిన హామీ తుస్సుమంది. ఫీజు రీయంబర్స్ మెంట్ అంతంత మాత్రమే. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు ఆగిపోయాయి. విదేశీ విద్యను నాలుగేళ్ల పాటు ఆపేశారు. ఫీజు ఎంతైతే అంత ఇచ్చి అదనంగా మరో 20 వేలు ఇస్తామనే హామీ గంగలో కలిసిపోయింది.
ఊరూవాడా మద్యం, గంజాయి..
మద్య నిషేధం లేదు. వీధికో బెల్ట్ షాప్ వచ్చేసింది. ఊళ్లకు ఊళ్లు గంజాయితో గుప్పుమంటున్నాయి. మూడు దశలలో సంపూర్ధ మద్యపాన నిషేధాన్ని తీసుకువస్తామనే హామీ లక్షలాది కుటుంబాల్లో విషాదాన్ని పెంచింది. నాసిరకం మద్యంతో, విచ్చలవిడి గంజాయితో మద్య నిషేధం గురించి మాట్లాడే పరిస్థితులే లేకుండా పోయాయి. వైసీపీ ప్రభుత్వంలో గంజాయి సాగు, రవాణా, వాడకం విపరీతంగా పెరిగాయి. గంజాయి ప్రభావం శాంతి భద్రతలపై పడిందని, ఆ కారణంగానే నేరాల రేటు గణనీయంగా పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా సంస్థలు గంజాయి కేంద్రాలుగా మారిపోతున్నాయి. బటన్ నొక్కుడు పథకాలు ఉండాలంటే మద్య నిషేధం సాధ్యం కాదని ప్రభుత్వ పెద్దలే బహిరంగంగా చెబుతున్నారు. పేదలందరికీ ఇళ్లు అనే ఎనిమిది నవరత్నం ప్రారంభ సమస్యలతో సతమతమవుతోంది. హామీ ప్రకారం 25 లక్షల ఇళ్లను కట్ట కపోగా గత ప్రభుత్వం నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్ల పనులను కూడా ఆపేసి పేదల పొట్ట కొట్టారు.
సీపీఎస్ రద్దు హామీ తూచ్..
ఉద్యోగులిచ్చిన సీపీఎస్ రద్దు హామీ గాలిలో కలిసిపోయింది. జగన్ కు సరైన అవగాహన లేకే అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తాననే హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విశేషం. జగన్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాతే ఈ విషయం చెప్పడం మరో విశేషం. సీపీఎస్ ఇవ్వకపోగా సీపీఎస్ కోసం ఉద్యమించిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపడం, తప్పుడు కేసులు బనాయించడం జగన్ జమానాకు అద్దం పడుతోంది.
నిరుద్యోగులకు భలే టోపీ..
ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని జగన్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపించిన తరుణంలో ఇపుడు అంతంత మాత్రంగా గుర్తుకొచ్చింది. నాలుగేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. పైగా అప్పట్లో లక్షల ఉద్యోగాలు ఇప్పడు వందలు, వేలకు కుదించుకుపోయాయి. ఉద్యోగావకాశాలను దెబ్బకొట్టేందుకు రిటైర్మెంట్ వయస్సును అదే పనిగా పెంచుకుంటూ పోవడం కూడా నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. తెలుగుదేశం సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికే జనంలోకి వెళ్లాయి. వాటికి పోటీగా వైసీపీ పెద్దలు ఎలాంటి హామీలు ఇస్తారో, ఓటర్లు వాటిని ఏమేరకు విశ్వసిస్తారో వేచిచూడాల్సిందే.