కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం.. 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు

by Gantepaka Srikanth |
కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం.. 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు
X

దిశ ప్రతినిధి, కర్నూలు: కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. ప్రతి ఏటా వందల మంది తలలు పగిలి రక్తం కారుతున్నా.. నేటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకవైపు పోలీసులు హింసాత్మకమైన సంప్రదాయాన్ని వీడాలని ప్రతి ఏడాది అవగాహన కల్పించిన ఆయా గ్రామాల ప్రజలు మాత్రం ఇది హింసాత్మకం కాదని.. భక్తితో కూడుకున్న సంప్రదాయమని.. తాము సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించమంటూ కర్రల సమరానికి సిద్ధం కావడం విశేషం. నేడు విజయదశమి సందర్భంగా అర్ధరాత్రి ఈ కర్రల సమరం జరగనుంది. ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్టాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు.

ఉత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయంటే..

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలంలోని నెరణి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు మధ్యన సముద్ర మట్టానికి దాదాపు 2 వేల అడుగుల ఎత్తులో దేవరగట్టు అనే దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. త్రేతాయుగంలో దట్టమైన దేవరగట్టు ప్రాంతంలో మునీశ్వర్లు లోక కల్యాణం కోసం గొప్ప తపస్సు చేయాలని భావిస్తారు. వీరి తపస్సును భగ్నం చేసేందుకు మునికాసురుడు, మల్లాసురుడు అనే రాక్షసులు యత్నిస్తే వారి నుంచి రక్షణ కల్పించారని పార్వతీ పరమేశ్వరులను వేడుకోగా వారు దేవరగట్టుకు చేరుకొని కూర్మ అవతరంలో కొండ గుహలో స్వయంభువుగా వెలిశారు. ఇలా గుహలో వెలసిన పార్వతీ పరమేశ్వరులే మాళవి మల్లేశ్వరులు.. నాటి నుంచి నేటి వరకు వారిని మాళ మల్లేశ్వర స్వామిగా పిలుస్తున్నారని చరిత్ర చెబుతుంది. మాళ మల్లేశ్వర స్వామి వార్లైన పార్వతీ పరమేశ్వరులు దేవరగట్టుపైకి వచ్చిన తర్వాత వేలాదిమంది జనంతో రాక్షస సంహారానికి మాళ మల్లేశ్వర స్వామి వెళతారు. సంహారానికి ముందు మీ చివరి కోరిక ఏంటని రాక్షసులను అడుగుతారు. తమకు నరబలి కావాలని రాక్షసులు కోరతారు. అలా కుదరదని చెప్పి ఐదు చుక్కల రక్తం గురవయ్య ఇచ్చిన తర్వాత రాక్షస సంహారం జరుగుతుంది. ఆ ఐదు చుక్కల రక్తమే ప్రతిసారి కర్రల ఉత్సవంలో రక్తం చిందడం అనవాయతీ అని స్థానికులు చెబుతున్నారు.

ఉత్సవాలు ఏఏ ప్రాంతాల వారు చేస్తారంటే..

నెరణి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు విజయదశమి రోజు రాత్రి భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువు కట్ట వద్దకు చేరుకుని వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని చేసుకుందామని పాలబాస తీసుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. అక్కడ అర్ధరాత్రి మాళవి మల్లేశ్వరులకు కల్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను మోసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండపై నుంచి మెట్లు దిగుతుండగానే కర్రలు గాలిలో ఆడుతాయి. దివిటీలు భగ్గుమంటాయి. కర్రలు తగిలి ఎన్నో తలలు పగులుతాయి. నిట్రవట్టి, కురుకుంద, అరికెర, అరికెర తండా, ఎల్లార్తి, సుళువాయి, బిలేహాల్, విరుపాపురం, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. మల్లప్ప గుడిలో మాళ మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలను కొద్దిసేపు అధిష్టించి పూజలు చేస్తారు. అనంతరం స్వామి వారి విగ్రహాలతో ఊరేగింపుగా వెళ్తారు. ఆ సమయంలో మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు. పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి భక్తుల ఒళ్లు కాలిపోతాయి. గతంలో కొందరు మృతి చెందిన సందర్భాలున్నాయి. ఉత్సవాల్లో గాయపడిన వారికి స్వామివారికి చల్లే పసుపు అంటిస్తారు. ఈ ఉత్సవ వేడుకకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

800 మంది పోలీసులతో భారీ బందోబస్తు..

ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆధ్వర్యంలో 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంతకు మునుపు ఘర్షణకు పాల్పడ్డ వారిని, అక్రమ మద్యం రవాణా చేసే వారిని గుర్తించి దాదాపు 148 మందిని బైండోవర్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడీ లైట్లు, 5 డ్రోన్ కెమెరాలు, వీడియో కెమెరాల మధ్య ఈ కర్రల సమరం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed