రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఫైర్

by Javid Pasha |   ( Updated:2023-08-01 13:51:28.0  )
రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఫైర్
X

దిశ, కడప: నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు తెదేపా అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు చేసినంత ద్రోహం ఎవ్వరూ చేయలేదని, చంద్రబాబు చరిత్రలో రాయలసీమ ద్రోహిగా నిలిచి పోతారని డిప్యూటీ ముఖ్యమంత్రి ఎస్.బి అంజాద్ బాషా, రాయచోటి ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం వైఎస్సార్సీపీ కార్యాలంయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని వారు ప్రశ్నించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం వల్లే నేడు రాయలసీమకు సాగు, తాగునీరు అందుతోందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం పై ధర్నా చేసిన సీమ ద్రోహి దేవినేని ఉమామహేశ్వరరావుకు నీటి పారుదలశాఖ మంత్రి పదవి ఇవ్వలేదా అని దుయ్యబట్టారు.రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వద్దన్న ఒక ద్రోహికి మంత్రి పదవి ఇవ్వడం సిగ్గు చేటన్నారు.

వైసీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసి తెలుగుగంగకు నీరు తీసుకు వచ్చి 18 టీఎంసీల నీరు నిల్వ చేశామన్నారు. గండికోటలో 26 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు. గతంలో ఆరు టీఎంసీలకు మించ లేదని ఆయన గుర్తు చేశారు. వెయ్యి కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జగన్ ప్రభుత్వం ఇచ్చి గండికోట ప్రాజెక్టులో పూర్తిస్థాయి సామర్థ్యంతో నీరు నిలబెట్టారన్నారు. ఏ మొఖం పెట్టుకొని చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్నారో చెప్పాలన్నారు. రాయలసీమ కు చేసిన ద్రోహనికి ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు రాయలసీమకు చేసిన ద్రోహానికి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. ఏ రోజు ప్రాజెక్టు గురించి మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ప్రాజెక్టుల గురించి చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణను ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలన్నారు. గాలేరు-నగరి, హంద్రీ -నీవా ప్రాజెక్టులను పదేళ్ల పాలనలో టీడీపీ నిర్లక్ష్యం చేయడం వల్ల నేడు నష్టపోయింది వాస్తవం కాదా అన్నారు. ప్రాజెక్టుల పై నిర్లక్ష్యం వహించి నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యుద్ద ప్రాతిపదికన జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు పూర్తి కృషి చేశారన్నారు. తెలుగుగంగ 1984 లో రూప కల్పన చేస్తే సుదీర్ఘ కాలంలో రూ.1700 కోట్లు ఖర్చు చేస్తే, 2004 -2009 మధ్య కాలంలో రూ.2,500కోట్లు వై.ఎస్. ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

వెలిగొండ, తెలుగుగంగ పనులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందన్నారు. గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక్క పైసా కూడ టీడీపీ హయంలో ఖర్చు పెట్టలేదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రాయలసీమ ప్రాజెక్టులకు రూ.5,600 కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్టులు వద్దన్న చంద్రబాబు తిరిగి ప్రాజెక్టుల సందర్శన అనడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ లో నికర జలాల కేటాయింపులు జరగలేదన్నారు. ఇందుకు చంద్రబాబు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రాయలసీమకు ఉపయోగపడే ప్రాజెక్టులను గాలికి వదిలేసి ద్రోహం చేశారన్నారు. తెలుగుగంగ, గాలేరు నగరి, గండికోట, బ్రహ్మంసాగర్ వంటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కైనా శంకుస్థాపన చేసి పూర్తి చేశావా అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు ఎస్ రఘురామిరెడ్డి, డాక్టర్ సదాసరి సుధ, నగర మేయర్ కె సురేష్ బాబు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed