నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్

by sudharani |
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది. సాయంత్రం నాలుగున్నర గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరతారు. 4.50గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 5గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరతారు. రాత్రి 7.15గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి 1-జన్‌పథ్ చేరుకుంటారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రికి సీఎం జగన్ ఢిల్లీలోనే బస చేయనున్నారు.

అయితే శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అకస్మాత్తుగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారుకావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర సమస్యలు,పెండింగ్ బకాయిలు వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో సీఎం వైఎస్ జగన్ చర్చించనున్నారు. అలాగే జూలై నుంచి విశాఖ నుంచే పాలన అందిస్తామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సుప్రీంకోర్టులో రాజధాని అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో న్యాయసంబంధమైన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విశాఖ నుంచి పాలనపై కేంద్ర పెద్దలకు సీఎం జగన్ సమాచారం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అనేక న్యాయ పరమైన అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed