సీఎం వైఎస్ జగన్‌కు ఓటమి ఫోబియా పట్టుకుంది: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

by Seetharam |
Tulasireddy-1
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నేత, పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిల అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. ఇద్దరి నేతల అరెస్ట్ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో బుధవారం తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఓటమి ఫోబియా పట్టుకుందని విమర్శలు చేశారు. అందుకే అక్రమ కేసులు బనాయించి టీడీపీ నేతలను అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆరోపించారు. బీటెక్ రవి అరెస్ట్ విషయంలో దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ప్రభుత్వం వాలకం ఉందని ఎద్దేవా చేశారు. జనవరి 25న కడప విమానాశ్రయం వద్ద చిన్న తోపులాట జరిగితే నవంబర్ 14న కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వద్ద రాత్రి సినిమా ఫక్కీలో అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రత్యర్థులు ఎవరు ఉన్నారో వాందరినీ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. మహామహా నియంతలే కాలగర్భంలో కలిసిపోయారని..జగన్ ఎంత అని గుర్తుచేశారు. ఇప్పటికైనా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం మానుకొని ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన చేయాలని సీఎం వైఎస్ జగన్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed