AP Pensions:‘పింఛన్లు పంపిణీ సంతృప్తినిచ్చింది’..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP Pensions:‘పింఛన్లు పంపిణీ సంతృప్తినిచ్చింది’..సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ కార్యక్రమం పై తాజాగా స్పందించారు. ఆగస్టు 1వ తేదీన ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించాం అని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత అన్నారు. పెరిగిన పింఛన్ ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే..ప్రభుత్వంలో భాగం అన్నారు. ప్రజలకు ఏ మంచి చేయాలన్న వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేశాం అని వెల్లడించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..అనేక సమస్యలు ఉన్నా, రూ. 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1 తేదీన చెల్లించమని సీఎం తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తేల్చి చెప్పారు. ‘కలిసి కష్టపడదాం..రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం’ అని పిలుపునిస్తున్నా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed