అప్రమత్తంగా ఉంటేనే కాపాడగలం: టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

by karthikeya |   ( Updated:2024-10-14 08:20:59.0  )
అప్రమత్తంగా ఉంటేనే కాపాడగలం: టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 4 రోజుల్లో భారీ, నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా కీలక సమావేశం నిర్వహించారు. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామునుంచి అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతంలో ప్రజలను ముందుగా అప్రమత్తం చేయాలని, అందరి మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు పంపి అలెర్ట్ చేయాలని సూచించారు.

‘‘చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టడమే కాకుండా వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి. రియల్ టైంలో రెయిన్ ఫాల్ వివరాలను అందుబాటులో ఉంచండి. కంట్రోల్ రూంలను కూడా ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించండి. అప్రమత్తంగా ఉంటేనే ప్రాణ, ఆస్తినష్టం లేకుండా కాపాడగలం’’ అని సూచనలు జారీ చేశారు. అలాగే సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

కాగా.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 734 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కాగా.. 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు వెల్లడించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుసే అవకాశాలున్నాయని అధికారులు తెలియజేశారు.

ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది. రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌ టీమ్స్ సిద్ధంగా పెట్టాం’’ అని అధికారులు చంద్రబాబుకు వెల్లడించారు.

Next Story

Most Viewed