Nara lokesh: పేదరికం లేని ఏపీ చంద్రబాబు కల

by srinivas |   ( Updated:2023-01-30 11:35:00.0  )
Nara lokesh: పేదరికం లేని ఏపీ చంద్రబాబు కల
X
  • అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు నడిపిస్తాం
  • 175నియోజకవర్గాల్లో మైక్రో యూనిట్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం
  • సీబీఐ నుంచి అవినాశ్ రెడ్డిని కాపాడేందుకే ఢిల్లీకి సీఎం జగన్
  • వివేకాను చంపింది ఎవరో మీకు అర్థమైంది కదా?
  • యువతతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్

దిశ, డైనమిక్ బ్యూరో: 'దేశ, రాష్ట్ర భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుంది. 67 ఏళ్లుగా రాష్ట్రాన్ని పలువురు ముఖ్యమంత్రులు బాగుచేస్తూ వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ గేర్ వేసి వెనక్కి శరవేగంగా తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే యువతపై కేసులు పెడుతున్నారు..జైళ్లలో పెడుతున్నారు'అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర నాలుగవ రోజు వీకోట మండలంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా వీ కోట టౌన్‌లోని జీఎంఆర్ కళ్యాణ మండపంలో తెలుగు యువత ఏర్పాటు చేసిన ''హలో లోకేశ్'' కార్యక్రమంలో యువతతో నారా లోకేష్ ముఖాముఖి అయ్యారు.

ఈ సందర్భంగా యువత సమస్యలను నారా లోకేశ్ విన్నారు. అనంతరం యువతతో మాట్లాడారు. 'యువత పోరాటానికి మద్దతుగా నిలబడేందుకే 'యువగళం' కార్యక్రమాన్ని ప్రారంభించాను. 'జగన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు యువగళం యువతకు ఓ సదావకాశం. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో దాక్కున్న పిల్లి. ముఖ్యమంత్రి అంటే ప్రజల మధ్య ఉండాలి..కానీ ఇతను పరదాలు చాటున దాక్కుని ఉంటున్నాడు. రాష్ట్ర ప్రజలంతా జగన్ రోడ్డుమీదకు రాకూడదు అని కోరుకుంటున్నారు. కారణం...ఆయన రోడ్డుమీదకు వస్తే అతను వెళ్లే మార్గంలోని ఇళ్లలోని వ్యక్తులు కనీసం కిటికీ కూడా తీయకూడదు. ఒక వేళ తీస్తే కేసులు పెడుతున్నారు' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

ఉద్యోగాలివ్వలేక రిటైర్మెంట్ వయసు పెంచుతారా?

'ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా తెస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు తెస్తాం అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఢిల్లీ పెద్దల కాళ్లు మొక్కడం తప్ప, రాష్ట్రం కోసం నోరెత్తిన పరిస్థితి లేదు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలేమయ్యాయి తాడేపల్లి ప్యాలెస్ పిల్లి?' అని లోకేశ్ ప్రశ్నించారు. 'యువతకు జాబ్ క్యాలెండర్ ద్వారా 3 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ ఇస్తున్నాడు. పోలీసు, టీచర్ ఉద్యోగాలు భర్తీని నిలిపేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాడు. సిగ్గు అనిపించడం లేదా జగన్ నీకు?' అని లోకేశ్ నిలదీశారు. ఉద్యోగాలివ్వలేక రిటైర్మెంట్ వయస్సును పెంచుతున్నాడని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల ముందు ఏపీకి ఒకే రాష్ట్రం ఉండాలన్న జగన్...అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని ఎందుకు అంటున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్ని ప్రాంతాలకు అందించి మెరుగైన జీవన వ్యవస్థను నిర్మించడం. ఇది మేం అధికారంలో ఉండగా అన్ని జిల్లాలలకు కంపెనీలు, పరిశ్రమలు తెచ్చాం అని లోకేశ్ తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు పేరుతో రాష్ట్ర యువతను ఘోరంగా మోసం చేస్తున్నారు అని లోకేశ్ ధ్వజమెత్తారు.

పరిశ్రమలను తరిమేయడం జగన్ బ్రాండ్

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు బ్రాండ్ అయితే కంపెనీలు, పరిశ్రమలను తరిమేయడం జగన్ బ్రాండ్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రాంతాలకు దామాషా పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం...అంతేకాని ఆచరణకు సాధ్యం కాని మూడు రాజధానులు నిర్మాణం కాదని చెప్పారు. వందలాది కంపెనీలను పక్కరాష్ట్రాలకు తరిమేయడం అభివృద్ధి వికేంద్రీకరణ కాదు. సీబీఐ నుంచి అవినాశ్‌ను కాపాడేందుకు ఢిల్లీ వెళుతున్న జగన్..ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు వెళుతున్నానని కలరింగ్ ఇస్తున్నాడు. వివేకాను చంపింది ఎవరో మీకు అర్థమైంది కదా? సీబీఐ విచారణకు ఎవరు వెళుతున్నారో చూస్తున్నారు కదా?. చంద్రబాబుపై హత్య నేరాన్ని కక్షతో రుద్దిన విషయం రుజువైంది కదా? అని లోకేశ్ యువతకు తెలియజేశారు. దావోస్ పర్యటనకు వెళ్లి పరిశ్రమలు తీసుకురాలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ ఈ రాష్ట్రానికి అవసరమా?. దావోస్‌లో చలి ఎక్కువగా ఉందని వెళ్లలేదని మంత్రి చెప్పడం సిగ్గుచేటు అని లోకేశ్ విరుచుకుపడ్డారు.

నిరుద్యోగులైన 35 లక్షల మంది యువత

'జగన్ పాలనలో 35 లక్షల మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ప్యాలెస్ పిల్లిని శాశ్వతంగా ప్యాలెస్‌లోనే పెట్టి తాళం వేయాలనే దృఢ సంకల్పంతోనే యువగళం ప్రారంభించాను. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ చట్టం తెచ్చారు. అది యువతకు తీవ్రమైన నష్టాన్ని తెస్తుంది. యువతకు మ్యానిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్య వ్యవస్థలోనూ మార్పులు తెచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈ విషయాన్ని మ్యానిఫెస్టోలో పెడతాం. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే వి.కోటలో డిగ్రీ కళాశాల పూర్తి చేస్తాం. మైనారిటీ సోదరీమణులకు ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీని మేం ఇస్తే...దాన్ని జగన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు. పేదరికంలేని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కల. దీన్ని నెరవేర్చేందుకు అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు నడిపిస్తాం. 175 నియోజకవర్గాల్లో మైక్రో యూనిట్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పక్క రాష్ట్రానికి వెళ్లిన యువత మొత్తం మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వరకు విశ్రమించను' అని లోకేశ్ హామీ ఇచ్చారు.

READ MORE

రైతులంటే జగన్‌కు చిన్నచూపు.. పాదయాత్రలో నారా లోకేశ్ ఫైర్

Advertisement

Next Story