AP కి భారీ వర్ష సూచన... అధికారులకు CM JAGAN కీలక ఆదేశాలు

by srinivas |
AP కి భారీ వర్ష సూచన... అధికారులకు CM JAGAN కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాండూస్‌ తుఫాను నేపథ్యంలో అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాండూస్ తుఫాన్ తీరం దాటినప్పటికీ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ శనివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావం, ప్రస్తుత పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో అవసరమైతే పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపోతే మాండూస్‌ తుపాన్‌ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

తీరం దాటిన మాండూస్ తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ తీరం దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని తెలిపారు. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం,నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం కూడా చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. తుఫాను తీరం దాటినప్పటికి ఆదివారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు అని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు.

Also Read: ఏపీలో మరో ఎన్నికలకు నోటిఫికేషన్... 21న పోలింగ్

YCP Twitter అకౌంట్‌ హ్యాక్‌... ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు

Next Story

Most Viewed