చంద్రబాబు మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వస్తారు: Nara Bhuvaneshwari

by Seetharam |   ( Updated:2023-10-12 12:26:11.0  )
చంద్రబాబు మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వస్తారు: Nara Bhuvaneshwari
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి రోజు రోజుకు మహిళల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. రాజమహేంద్రవరం క్యాంపులో నారా భువనేశ్వరిని పలువురు మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సంఘీభావం ప్రకటించారు. రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం నియోజకవర్గాలతో పాటు భువనేశ్వరి దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన కొమరవోలు గ్రామస్తులు గురువారం రాజమహేంద్రవరంలో ఆమెను కలిసి సంఘీభావం తెలియజేశారు. చంద్రబాబు అరెస్టుతో తాము ఎంతో మనోవేధనకు గురయ్యామని...చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయాన్ని భువనేశ్వరి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్లుబుకుతున్నాయన్నారు. నిత్యం రాష్ట్రం కోసం శ్రమించే చంద్రబాబును జైలు లో పెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ...తమకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామన్నారు. త్వరలోనే చంద్రబాబు విడుదలై మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వస్తారని భువనేశ్వరి వారిని ఓదార్చారు.

భువనేశ్వరితో పార్టీ సీనియర్ నేతలు భేటీ

నారా భువనేశ్వరిని పలువురు టీడీపీ సీనియర్ నేతలు గురువారం కలిశారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, కె.ఎస్. జవహర్ భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్ట్ పై పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలు ఆమెకు వివరించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తన కుటుంబ సభ్యులతో భువనేశ్వరిని కలిశారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నాయకులతో కలిసి భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ లో జరుగుతున్న నిరసనలను వివరించారు.

Advertisement

Next Story