‘చంద్రబాబు ప్రచారం అంతా అబద్ధాలే’..ప్రజా గళం సభ పై ఆ పార్టీ ఎమ్మెల్యే ధ్వజం!

by Jakkula Mamatha |   ( Updated:2024-03-31 11:50:55.0  )
‘చంద్రబాబు ప్రచారం అంతా అబద్ధాలే’..ప్రజా గళం సభ పై ఆ పార్టీ ఎమ్మెల్యే ధ్వజం!
X

దిశ,శ్రీకాళహస్తి:టీడీపీ ప్రజా గళం సభలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు ప్రచారం చేశారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పేదల కోసం అమలు చేశారని, అయితే చంద్రబాబు నాయుడు ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయకనే పదివేల కోట్ల రూపాయలను స్వాహా చేశారని ఆరోపించారు. ల్యాంకో కర్మాగారాన్ని 15 రోజులు మూత వేయించానని ఆరోపణ చేయడం సరికాదని, దేవస్థానం గురించి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఐఐటీ, ఐషర్ల నిర్మాణానికి ఎస్సీ ,ఎస్టీల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందని, ఆయన కుమారుడు సుదీర్ రెడ్డిని పోలీసులు అధికారులు పట్టుకొని విచారణ చేశారని గుర్తు చేశారు. అందువల్లే గోపాలకృష్ణారెడ్డి మంత్రి పదవి పోయిందని, ఆయన హయాంలోనే ఏర్పేడు లో 17 మంది ఇసుక మాఫియా వల్ల మృతి చెందారని ఆరోపించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో గోపాలకృష్ణారెడ్డి ఉన్నప్పటి నుంచి దళారులు ఉన్నారని వారిని నియంత్రణ చేస్తున్నామని తెలిపారు. 22 సంవత్సరాలుగా కుంభాభిషేకానికి నోచుకోని 33 ఆలయాలకు కుంబాభిషేకం జరిపించారు.పేదలకు 25 వేల పట్టాలు ఇచ్చామని వివరించారు. రాజీవ్ నగర్ లో పట్టాల అమ్మకానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని వాటిని పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మిద్దెల హరి, పార్టీ నాయకులు వాసుదేవ నాయుడు, మధు రెడ్డి, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed