నెల్లూరులో జనసేనకు బిగ్ షాక్: వైసీపీలోకి కీలక నేత

by Seetharam |
నెల్లూరులో జనసేనకు బిగ్ షాక్: వైసీపీలోకి కీలక నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎత్తులు, పొత్తుల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తాజాగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. ఎన్నికలకు నెలల వ్యవధి ముందే నేతలు రాజీనామా చేస్తుండటం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనసేన పార్టీ ప్రారంభం నుంచి పనిచేసిన నాయకులు తమ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ చివరి క్షణాల్లో ముఖం చాటేస్తున్నారు. రాజకీయ భవిష్యత్ దృష్ట్యా జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసి వేరే పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మాకినీడి శేషుకుమారి పార్టీకి గుడ్ బై చెప్పగా....తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన పార్టీలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన మెుదలైంది.

గడప గడపకు జనసేనను తీసుకెళ్లా

నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం కల్పించడం లేదని ఇదే అంశంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎదుట కన్నీటి పర్యంతం అయినా కూడా ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. అందువల్లే పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘2003లో విద్యార్థి నేతగా జాతీయ కాంగ్రెస్ పార్టీతో మొదలైన నా రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు స్థాయి వరకు ఎదిగేలా అనేక అవకాశాలు కల్పించింది. ఆ ప్రయాణంలో దివంగత నేత తమ గురువు ఆనం వివేకానందరెడ్డి తనకు అందించిన తోడ్పాటు, రాజకీయ జ్ఞానం మరువలేనిది అని కొనియాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌పార్టీని వీడి జనసేనలో చేరాను. ఒక నిబద్ధత గల జనసైనికునిగా పనిచేస్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాను. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం కృతజ్ఞుడను’ అనికేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.

అవమానాలను సైతం భరించా

2019 ఎన్నికల్లో ఓడిపోయినా ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పవన్ కల్యాణ్‌పై అభిమానంతో... పార్టీ అభివృద్ధి కోసం నిత్యశ్రామికుడిలా కృషి చేశాను అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్టీ పరంగా అంతర్గతంగా నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, పార్టీలో నాకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా, నాకు తగిన విలువ ఇవ్వకుండా నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా పంటి బిగువున భరించాను. ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ ఎదుటే కన్నీటిపర్యంతం అయ్యాను తప్పించి ఏనాడూ కూడా మరో వేదికలో పంచుకోలేదు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే, ఆయనతో నేనుంటే, ప్రజలకు మరింతగా సేవ చేయగలిగే అవకాశం వస్తుందనే నేను ఎల్లప్పుడూ భావించాను. అందుకే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనే సింగిల్ పాయింట్ ఎజండాతో నేను 316 రోజుల పాటు నా నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా‘పవనన్న ప్రజాబాట’చేశాను అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.

పవన్‌పై నమ్మకంతోనే ఇన్నేళ్లు భరించా

‘మూడు నెలల క్రితమే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ మాజీమంత్రి నారాయణని అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటికి జనసేన పార్టీకి, టీడీపీకి పొత్తు లేదు. అయినప్పటికీ పార్టీలోని పెద్దలు పలువురు తనను పిలిచి వచ్చే ఎన్నికల్లో సీటుని ఆశించవద్దు..అక్కడ టీడీపీ తరఫున నారాయణ గారు పోటీ చేస్తున్నారు..మనం ఆయనకు పని చేయాలి అని సూచించారు’ అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. తాను 2016లో సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే ఈ నారాయణ అక్రమాల మీద అని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా నారాయణ అక్రమాల మీద బలంగా గళం వినిపించానని, అయినప్పటికీ పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, నేను సీటుని ఆశించట్లేదని వారితో తెలిపాను. అయినప్పటికీ పార్టీలో నాకంటూ గౌరవం లేకుండా, నేను భరోసా కల్పించిన ప్రజలకు నమ్మకం పోగొట్టేలా, పార్టీలోని పెద్దలు పలువురు నిత్యం అదేపనిగా కృషి చేస్తున్నారు అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో హత్యలుండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయి. ఇన్ని రోజులు పార్టీలో నాకు ఎన్ని అవమానాలు జరిగినా ఆత్మాభిమానాన్ని చంపుకుని పని చేసానంటే కేవలం పవన్ కల్యాణ్ ఉన్నారు, ఆయన తప్పక ముఖ్యమంత్రి అవుతారు అని నేను నమ్మిన ఒకే ఒక నమ్మకంతోనే. కాని నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవమానాలను భరిస్తూ ఉండలేను. నా ఓర్పు, సహనం నశించింది. నా మనస్సు చచ్చిపోయింది. పని చేసినన్ని రోజులు నీతి, నిబద్ధతతో జనసేన పార్టీ కోసం పని చేశాను. ఇప్పుడు మనస్సులో వేరేది పెట్టుకుని పనిచేయలేను. అలా చేస్తే అది రాజకీయంగా నా ఆత్మహత్యాసదృశ్యమేనని కేతంరెడ్డి వినోద్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకే అన్ని కోణాల్లో అలోచించి, నాతో కలిసి పనిచేసిన అనేక మంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుని జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు.

త్వరలో వైసీపీలోకి

ఇదిలా ఉంటే కేతంరెడ్డి వినోద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వైసీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే కేతంరెడ్డి వినోద్ రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు చర్చలు సైతం ముగిసినట్లు తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చర్చలు జరిపారని.. చర్చలు ఫలించడంతో ఇక వైసీపీలో చేరడమే తరువాయి అని నెల్లూరు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed