సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు.. నేడే తీర్పు..?

by Javid Pasha |   ( Updated:2023-10-10 06:25:34.0  )
సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు.. నేడే తీర్పు..?
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 17ఏ చుట్టూనే వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తుండగా.. సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తున్నారు. విచారణ విధానంపై ఇరుపక్షాలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

నోటీసులు జారీ చేయాలన్న రోహిత్గీ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు విధివిధానాలను ఇరుపక్షాల న్యాయవాదులు బెంచ్ ముందు ఉంచారు. మీ వాదనలకు ఎంత సమయం కావాలని సాల్వేను జస్టిస్ బోస్ ప్రశ్నించగా.. కనీసం గంట సమయం కావాలని కోరారు. దీంతో గంట తర్వాతే వస్తానని బెంచ్‌కు రోహిత్గీ చెప్పారు. నోటీసులు ఇస్తారా? అనే అంశాన్ని బెంచ్ తేల్చాలని రోహిత్గీ కోరగా.. కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హరీష్ సాల్వే వాదించారు.

హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్ల అవసరం ఉండదని జస్టిస్ త్రివేది చెప్పారు. క్రిమినల్ కేసుల్లో మళ్లీ కౌంటర్ అఫిడవిట్ల అవసరమేంటని హరీష్ సాల్వే వాదించగా.. నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని, అలా కాకపోతే మళ్లీ మొదటికొస్తుందని రోహిత్గీ అన్నారు. నోటీసులు అవసరం లేదన్న విధివిధానాలపై మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. దీంతో గతంలో వచ్చిన తీర్పులను కోర్టు ముందు ఉంచుతానని హరీష్ సాల్వే చెప్పారు.

17ఏ అనేది అవినీతి నిరోధంతో పాటు ప్రజాప్రతినిధులపై ప్రతీకార చర్యలు ఉండకూడదన్నది కూడా ప్రధానమే అని హరీష్ సాల్వే చెప్పారు. సాల్వే వాదనలు ముగిసిన తర్వాత రోహిత్గీ వాదనలు వినిపించనున్నారు. నిన్న సుదీర్ఘంగా వాదనలు జరగ్గా.. ఇవాళ కూడా లోతుగా వాదనలు జరుగుతున్నాయి. దీంతో నేడు సుప్రీం తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed