రామోజీరావు మృతికి నివాళిగా AP సర్కార్ మరో కీలక నిర్ణయం

by Satheesh |   ( Updated:2024-06-08 14:11:18.0  )
రామోజీరావు మృతికి నివాళిగా AP సర్కార్ మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, తెలుగు మీడియ దిగ్గజం రామోజీ రావు అనారోగ్యం కారణంగా శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. రామోజీ రావు చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక లాంఛనాల నడుమ ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

ఈ క్రమంలో రామోజీ రావు అంత్యక్రియలకు తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరుఫున ముగ్గురు సీనియర్ అధికారులను హాజరుకానున్నారు. సీనియర్ అధికారులు ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ ఏపీ సర్కార్ ప్రతినిధులుగా రామోజీ రావు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. మరోవైపు రామోజీ రావు మృతికి నివాళిగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలో సంతాప దినాలు పాటించాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సౌరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story