AP BJP: ముందు ఆ ముద్ర తొలగించండి.. లేదంటే ప్రమాదమే!

by srinivas |
AP BJP: ముందు ఆ ముద్ర తొలగించండి.. లేదంటే ప్రమాదమే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఏపీని అభివృద్ధి చేశాం...బీజేపీయే వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీ అంటూ నానా హంగామా చేసిన బీజేపీ నాయకత్వం ప్రజా తీర్పుతో బొక్క బోర్లా పడ్డారు. దీనికంతటికి బీజేపీ స్వయంకృతాపరాధమేనని ప్రచారం జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు మంచి గురించి ప్రజలకు వివరించడంలో ఫెయిల్ అవ్వడం ఒక కారణం అయితే విభజన హామీలు, విశాఖ రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలు మరో కారణం. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీలో ఆధిపత్యపోరు మరో కారణం. ఇవే కారణాలు బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేశాయనే ప్రచారం జరుగుతుంది. బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతలు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితికి దారి తీస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఇంతేకాదు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ఈసారి చెల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు రావడానికి బీజేపీ వైసీపీతో కుమ్మక్కయ్యిందనే ప్రచారం విస్తృతంగా జరిగిందని బీజేపీలోని ఓ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కొంపముంచిన బీజేపీ-వైసీపీ ఒక్కటేనన్న ప్రచారం

ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలపై అన్ని పార్టీలు పోస్టుమార్టం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వ్యతిరేకత, ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీశాయని వైసీపీ భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం వైసీపీతో రహస్య చెలిమి కొంపముంచిందని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో బీజేపీ కుమ్మక్కయ్యిందనే ప్రచారం బాగా జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రచారం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. ఈ ఓటమిపై పార్టీ జాతీయ నాయకత్వం అంతర్మథనం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ-వైసీపీ ఒక్కటేనన్న అభిప్రాయం ఓటర్లలో బలంగా వెళ్లిందని ఇది పార్టీకి మంచి కన్నా చెడు ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని దాన్ని క్యాష్ చేసుకునే దిశగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తే మంచి ఫలితాలు వస్తాయని విష్ణుకుమార్ రాజు సూచించారు.


వైసీపీతో ఉన్నామనే ముద్ర తొలగించకపోతే ప్రమాదం

ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణించాలని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారు. పట్టభద్రులు బీజేపీకి ఎందుకు దూరం అవుతున్నారో అన్న దానిపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా యువత బీజేపీకి దగ్గరవుతుంటే ఏపీలో ఎందుకు భిన్నంగా దూరమవుతున్నారో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ కలిసి పని చేస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పుకొచ్చారు. దాని ఫలితమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపితమైందన్నారు. వైసీపీతో ఉన్నామన్న భావన ప్రజల మదిలో నుంచి తొలగించే ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హితవు పలికారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ పట్టభద్రులు మాత్రం టీడీపీకే పట్టం కట్టారంటే ప్రభుత్వంపైనా వ్యతిరేకత మరోవైపు యువతలో వస్తున్న మార్పుకు సంకేతాలు అని చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ కలయిక తప్పనిసరి అని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఈ అంశంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలకు సమానదూరం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదేపదే ప్రకటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీతో పొత్తు అనివార్యమంటూ విష్ణుకుమార్ రాజు చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed