సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో అందరూ ఇన్చార్జిలే

by Mahesh |
సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో అందరూ ఇన్చార్జిలే
X

దిశ, బుట్టాయగూడెం: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో ప్రస్తుతం ఇంచార్జీల పాలనతో ఆదివాసుల అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు అధికారితో పాటు పీఓ తో సహా పలు ముఖ్యమైన విభాగాల్లో అధికారులు లేక ఇంచార్జులతో పరిపాలన జరుగుతోంది. గిరిజనాభివృద్ధి కోసమే ఐటీడీఏలు ఏర్పాటు చేసి 50 ఏళ్లు కావస్తున్నా గిరిజన అభివృద్ధిపై గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తుందని విమర్శించారు. ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఐదు ఏజెన్సీ మండలాలు రెండు నాన్ షెడ్యూల్ మండలాల్లో ఆదివాసీ ప్రజానీకం జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని గిరిజన అభివృద్ధి కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిరాశ్రయులు అవుతున్న వారికి పరిహారం, పునరావాసం కల్పించే బాధ్యత ఐటీడీఏకే ఉన్నాయి.

ప్రాజెక్టు అధికారే ఇంచార్జి..

గిరిజన అభివృద్ధి పాలన చూడాల్సిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాధ్యతలను ప్రస్తుతం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఐటీడీఏకు ఐఏఎస్ అధికారికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందని గిరిజన సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆదివాసీల విద్యారంగ అభివృద్ధికి పాటుపడాల్చిన ఉప సంచాలకులు గత సంవత్సరం నుంచి ఐటీడీఏ సహాయక ప్రాజెక్టు అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐటీడీఏ కార్యాలయం బాధ్యతలు చూస్తూనే జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు విద్యార్థుల సంక్షేమ విధులు నిర్వర్తించడంలో జాప్యం జరుగుతుందనే పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలు అధికంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన ఉప కలెక్టర్ (ఎస్డీసీ) విభాగంలో పోలవరం, కోట రామచంద్రపురం లో ఇద్దరు అధికారులు అవసరం. ప్రస్తుతం కోటరామచంద్రపురం ఎస్ డి సి బాధ్యతలు చూస్తున్న జి శ్రీనుకుమార్‌కు పోలవరం ఎస్డీసీ అదనపు బాధ్యతలు కేటాయించారు.

డీఎంఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఒక్కరేనా?

ఏజెన్సీ ప్రాంతంలో విద్య తర్వాత అత్యంత ప్రభావితమైనది ఆరోగ్యం. వైద్యం సక్రమంగా అందుతుందో లేదో పర్యవేక్షించే డిప్యూటీ డీఎంహెచ్ ఓ ప్రస్తుతం లేరు. గతంలో ఆ బాధ్యతలు నిర్వహించిన వేరే ప్రాంతానికి బదిలీ ఐయ్యాడు. జిల్లా మలేరియా నిర్మూలన అధికారి (డీఎంఓ) ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం ఆ రెండు శాఖల బాధ్యతలు పులిరాముడు గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యలుగా ఉన్న జె.సురేష్ కుమార్‌కు అదనంగా రెండు బాధ్యతలు కేటాయించారు.

గిరిజనులకు పోడు పట్టా మాటేమిటి..

పోలవరం నియోజకవర్గంతో పాటు పలు మండలాల్లో అటవీ హక్కు చట్టం ప్రకారం పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీలను గుర్తించి అర్హులకు పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఆ భాద్యతలు చూడాల్సిన ఆర్ఓ ఎఫ్‌ఆర్ (ఓఎస్టీ) కుర్చీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఏజెన్సీలో పోడు సాగు చేస్తున్న సుమారు నాలుగు వేల మంది వ్యక్తిగత క్లెయిమ్‌లు చేశారు. వీటిని పరిశీలించే అధికారి లేకపోతే పట్టాలొచ్చేదెప్పుడోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మైనర్ ఇరిగేషన్ ఏఈ కూడా ఇంచార్జే..

ఇరిగేషన్ కార్యాలయంలో ఏ ఈ బాధ్యతలు జంగారెడ్డిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయం ఇరిగేషన్ బాధ్యతలు చూస్తున్న వారికీ ఐటీడీఏ ఇరిగేషన్ ఏఈగా అదనపు బాధ్యతలు కేటాయించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా బైనేరు వాగుపై నిర్మించిన పోగొండ రిజర్వాయర్ అప్పటి టీడీపీ ప్రభుత్వం జాతికి అంకితం చేశారు. ఈ కార్యాలయంలో ప్రాజెక్టు అగ్రికల్చర్ ఆఫీసర్ (పీఏఓ) లేరు. ఆ బాధ్యతలను ప్రాజెక్టు హార్టికల్చర్ ఆఫీసరే రెండు శాఖల బాధ్యతలను చూస్తున్నారు. ఐటీడీఏ అభివృద్ధి జరగాలంటే అన్ని శాఖల్లో పూర్తి స్థాయి అధికారులు ఎంతైనా అవసరం. కేవలం గిరిజన అభివృద్ధితో పాటు పోలవరం నిర్వాసితులు పునరావాసం, పరిహారం ప్రశ్నార్ధక మవుతోంది. ఆలా జరగకపోతే గిరిజనాభివృద్ధి అనేక ఆటంకాలతో కుంటుపడుతుందని ఆదివాసీ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story