- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీ స్టార్ కాంపైనర్‌గా యువ హీరో... జూ.ఎన్టీఆర్ వచ్చే వరకేనా?
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఆపార్టీ నేతలు మాంచి జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ వైసీపీని అధికారంలోకి రానీయకుండా చేయడంతోపాటు.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యం అంటూ అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుతోపాటు స్టార్ కాంపైనర్‌లపై ఇరు పార్టీలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్టార్ కాంపైనర్‌లలో మెుదటిగా నారా రోహిత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఏ ఎన్నికలు వచ్చినా నారా రోహిత్ టీడీపీలో కీలకంగా మారతారు. టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దీంతో టీడీపీ తరఫున మెుదటి స్టార్ కాంపైనర్‌గా నారా రోహిత్ పేరు వినబడుతుంది. అంతేకాదు నారా రోహిత్‌కు టీడీపీలోని ముఖ్య నేతలకు సత్సంబంధాలు ఉండటంతో నారా రోహిత్‌ను స్టార్ కాంపైనర్‌గా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేలా చేయాలని పలువురు కోరుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీపై విపరీతిమైన అభిమానం
నారా రోహిత్..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనయుడు. అంటే చంద్రబాబు నాయుడుకు కుమారుడి వరుస. సినిమాల్లో నారా రోహిత్ తన టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రోహిత్ సినిమాలు అంత సూపర్ డూపర్ హిట్ కాకపోయినా ఫ్యామిలీ హీరోగా అందరి మన్నలను అందుకున్నారు. ఇకపోతే నారా వారి కుటుంబం అంటే తెలుగుదేశం కుటుంబం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో సైతం దూకుడుగా ఉంటారు నారా రోహిత్. ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అంతేకాదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తానున్నానంటూ ముందుకు వస్తారు. అంతేకాదు తన పెదనాన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు. అలాగే పెద్దమ్మ నారా భువనేశ్వరి జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టరు. ఇక సోదరుడు నారా లోకేశ్ ఏ కార్యక్రమం చేసినా లక్ష్మణుడి మాదిరిగా వెన్నంటి నిలుస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే నిత్యం రాజకీయాలపై అవగాహన పెంచుకుంటారు నారా రోహిత్. రాజకీయాల్లో ఏం జరుగుతుంది.. ఎలా స్పందించాలనేది రోహిత్‌కు బాగా తెలుసు. అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణల నేపథ్యంలో రోహిత్ ఘాటుగా స్పందించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయాన్ని ఈ వికృత క్రీడల వెనుక సూత్రధారి గుర్తుపెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ రావాలి రావాలి అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నప్పుడు ఆచి తూచి స్పందించారు. తారక్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని చెప్పుకొచ్చారు. పార్టీకి అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తారని వెల్లడించి వారిని శాంతింపజేశారు. అలాగే చంద్రబాబు నాయుడుకు జైల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యం అందడంలేదన్న అంశంపైనా ఘాటుగా ప్రశ్నించారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైనా స్పందించిన సంగతి తెలిసిందే. ఇలా కుటుంబంపై మక్కువ.. తెలుగుదేశం పార్టీ అంటే విపరీతమైన అభిమానంతోపాటు రాష్ట్ర రాజకీయాలపట్ల అవగాహన కలిగిన వ్యక్తి నారా రోహిత్. ఈ నేపథ్యంలో నారా రోహిత్‌ను టీడీపీ త్వరలోనే స్టార్ కాంపైనర్‌గా ప్రకటించబోతుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.
పెద్దమ్మకు భరోసా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలోనూ నారా రోహిత్ స్పందించారు. అసెంబ్లీ చర్చల్లో కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదంటూ ఘాటుగా హెచ్చరించారు. శిశుపాలుడి వంద తప్పులు పూర్తైనట్లు, వైసీపీ వంద తప్పులు పూర్తయ్యాయంటూ మండిపడ్డారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయాన్ని ఈ వికృత క్రీడల వెనుక సూత్రధారి గుర్తుపెట్టుకోవాలని హితువు పలికారు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరిని అసభ్య పదజాలంతో దూషించటం దిగ్భ్రాంతికరమని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, చంద్రబాబు నైతిక స్థైరాన్ని దెబ్బతీయాలనుకుంటే, అది మీ భ్రమే అవుతుందని కౌంటర్ వేశారు. స్థాయి లేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావటం దురదృష్టకరం పెదనాన్న.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. మేమంతా మీ వెంటే ఉంటాం అంటూ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి నారా రోహిత్ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
జూ.ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ రోల్‌పైనా నారా రోహిత్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ డెఫెన్స్‌లో పడిందని చెప్పుకొచ్చారు. వరుస పరాభవాలతో ఏం చేయాలో తెలియక పుంజుకుంటున్న టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని రోహిత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానులు ప్రశ్నించారు. తారక్ పొలిటికల్ ఎంట్రీపై రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తారక్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని చెప్పుకొచ్చారు. పార్టీకి అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తారని తెలిపారు. తారక్ సేవలను పార్టీ ఖచ్చితంగా వినియోగించుకుంటుందని అందుకు సమయం సందర్భం రావాలని నారా రోహిత్ వెల్లడించారు.
స్టీల్ ప్లాంట్ పోరాటంలో నేను సైతం అంటూ....
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో నేను సైతం అంటూ నారా రోహిత్ వారికి మద్దతు తెలిపారు.‘విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు’ అని నినదిద్దామని ఆంధ్రులకు పిలుపునిచ్చారు నారా రోహిత్. త్యాగాల కొలిమి నుంచి ఉద్భవించిన విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. ఆంధ్రులు 22వేల ఎకరాలు రాసిచ్చారని...64 గ్రామాలను ఆనందంగా ఇచ్చేశారని.. 32 మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉక్కు కర్మాగారం ఉనికే ప్రమాదంలో పడుతోందని.. ‘ఆంధ్రుడా మేలుకో’ అంటూ పిలుపునిచ్చారు. 60వ దశాబ్ధంలో పోరాడి సాధించుకున్న పరిశ్రమ, 21వ శతాబ్ధంలో ప్రమాదంలో పడటం బాధ కలిగించే విషయమన్నారు. 50ఏళ్లకు పైబడిగా కార్మికులు తమ శ్రమ, శ్వేదంతో అభివృద్ధి చేసిన కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడమే మనం సాధించిన అభివృద్ధా? అని నారా రోహిత్ ప్రశ్నించారు.
పెదనాన్నపై విపరీతమైన అభిమానం
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తన పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు అనారోగ్యంపై నారా రోహిత్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేక భౌతికంగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబు పట్ల జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అమానుషం అన్నారు. తన రాజకీయ జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. చంద్రబాబు జైలులో డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని... తక్షణ వైద్యం అందించాలని వైద్యులు చెప్తున్నా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని చూస్తే వారి రాక్షస పోకడలు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నాయి అని మండిపడ్డారు.చంద్రబాబు ప్రజల సంపద... ఆయన్ను ప్రజలే రక్షించుకుంటారని చెప్పుకొచ్చారు. మహోన్నత స్థాయి కలిగిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తే సమాజం క్షమించదన్న విషయం గుర్తుంచుకోవాలి అని సూచించారు. ఇప్పటికైనా కక్షలు, కార్పణ్యాలు వీడి మనుషుల్లా వ్యవహరించి చంద్రబాబుకు అవసరమైన వైద్యం అందించాలని ఓ ప్రకటనలో హీరో నారా రోహిత్ డిమాండ్ చేశారు.