వైద్య అధికారుల నిర్లక్ష్యం 12 నెలల చిన్నారి మృతి..!

by samatah |
వైద్య అధికారుల నిర్లక్ష్యం 12 నెలల చిన్నారి మృతి..!
X

దిశ, జి.మాడుగుల : అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ లువ్వాపల్లిలో 12 నెలల చిన్నారి మృత్యువాత పడింది. అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో చిన్నారి మృత్యువాత చెందిందని తల్లిదండ్రులు సెగ్గే చిన్నారావు, పార్వతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని సెగ్గే చిన్నారావు, పార్వతమ్మ దంపతుల 12 నెలల చిన్నారి అస్వస్థతకు గురైంది. దీనిపై స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది సకాలంలో స్పందించక పోవడంతో చిన్నారి శ్వాస అందక మృతి చెందింది.

దీంతోపాటు సమీప గ్రామం బలమానుసంకలో నెల రోజుల కిందట బాలింత కొండపల్లి కొండమ్మ రక్తహీనతతో మృతి చెందిన ఘటన మరువక ముందే చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి బాలింత కొండపల్లి కొండమ్మ మృతిని వైద్య సిబ్బంది బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారు. ఓ పక్క జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు హెచ్చరిస్తున్న వైద్య సిబ్బంది తీరు మారడం లేదు. శిశు మరణాలు, మాతృ మరణాలు సంభవిస్తే సంబంధిత వైద్యాధికారులు వైద్య సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరి తీరుపై పలువురు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed