YS Sharmila : 108 ఉద్యోగుల సమ్మెకు మద్ధతు ఇవ్వాలి : వైఎస్ షర్మిల

by Y. Venkata Narasimha Reddy |
YS Sharmila : 108 ఉద్యోగుల సమ్మెకు మద్ధతు ఇవ్వాలి : వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : అపర సంజీవని 108 అంబులెన్స్‌లను కాపాడుకునేందుకు ఉద్యోగ సంఘాలు(108 employees' strike)ఈ నెల 25నుంచి తలపెట్టిన సమ్మె(strike)కు ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) కోరారు. 108 ఉద్యోగ సంఘాల నేతలు తనను కలిసిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 108 వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగుల సమస్యలు తీర్చాలన్న డిమాండ్లతో చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో 108 వ్యవస్థకు ఆపద వచ్చిపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ కొడితే "కుయ్ కుయ్" మంటూ క్షతగాత్రుల వద్దకు వెళ్లే ఆరోగ్య ప్రదాయిని మూగబోతుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలకు అండగా నిలిచే ఈ వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్నారని షర్మిల విమర్శించారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సంజీవని 108ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆమె చెప్పారు.

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రిక 108 అంబులెన్స్ అని, ఆయన దూరదృష్టికి నిదర్శనంగా నిలిచిందన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలకు 108 వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని షర్మిల గుర్తు చేశారు. 108 వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఎక్యూప్మెంట్ సమకూర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. వాహనాల్లో సమస్యలు వస్తే కనీసం రిపేర్ చేయించకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఇంధనం లేదని గత నెల 140 వాహనాలను నిలిపివేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. 90 వాహనాలకు ఇప్పటికీ రిపేర్లు చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా 108వ్యవస్థకు గ్రహణం పడుతోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లు ఆగితే నష్టం ప్రజలకే వాటిల్లుతుందని వైఎస్ షర్మిల తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ న్యాయబద్ధమైనదే కాబట్టి... వెంటనే చర్చలకు పిలిచి... సమస్యలు పరిష్కరించాలని, 108 వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed