అభివృద్ధికి బాటలు వేస్తున్నాం !

by Anukaran |
అభివృద్ధికి బాటలు వేస్తున్నాం !
X

దిశ, ఏపీ బ్యూరో: 58రోజులపాటు నిరాహార దీక్షతో పాలకుల్ని కదిలించిన చైతన్యమూర్తి పొట్టి శ్రీరాములని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆదివారం రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములును తల్చుకుంటూ రాష్ర్ట అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశా. వాటికి పరిష్కారంగా గ్రామాల రూపు రేఖలను మార్చేస్తున్నాం. ఓ గ్రామం యూనిట్​గా తీసుకొని అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వ్యవస్థలను మేనేజ్​చేస్తున్న శక్తులు రాష్ర్ట ప్రజల సమగ్రాభివృద్ధికి ఆటంకంగా మారాయి. దైవ బలం, మనో సంకల్పంతో వీటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని జగన్​ ఉద్వేగంగా చెప్పారు.

అభివృద్ది ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరాలి

అభివృద్ధి ఫలాలు ప్రతీ ఒక్కరికీ అందించడమే అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించినట్లని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిరుపేదలకు అవసరమైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉప రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు..

అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తితో ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలని అభిలషిస్తూ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు ట్విటర్​లో పేర్కొన్నారు. భాషా సంస్కృతులను కాపాడుకుంటూ ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరని, ఆంధ్రులు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సమగ్ర అభివృద్ధి కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed