ఏపీలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన ఐఎంఆర్

by srinivas |
ఏపీలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన ఐఎంఆర్
X

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థ ఐఎంఆర్ ఏజీ ముందుకొచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రాకతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఏపీలో పారిశ్రామిక రంగం తిరోగమన దిశలో ఉండగా, వారం రోజుల్లోనే రెండు పెద్ద కంపెనీలతో చర్చలు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త జీవంపోస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఇనుముఉక్కు కర్మాగారానికి సుదీర్ఘ కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి ప్రతిపాదనతోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు రాగా, తాజాగా ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ ముందుకు వచ్చింది. ఈ మేరకు పూర్తి ప్రతిపాదనలతో ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌‌ను కలిశారు.

10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో సుమారు 12 వేల కోట్ల రూపాయలతో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం గనుల తవ్వకాలతో పాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుపుతున్నామని వారి అనుభవాన్ని సీఎంకు వివరించారు.

దీంతో సీఎం వారికి ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని, మరోస్టీల్ ప్లాంట్ పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన వివరించారు. విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతే కాకుండా ప్లాంట్ ఏర్పాటు చేస్తే కృష్ణపట్నం పోర్టు ద్వారా జల, రైల్వే, జాతీయ రహదారులతో రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన వారికి వివరించారు.

Tags: kadapa district, steel plant, imr ag, swiss company

Advertisement

Next Story

Most Viewed