జమ్ముకశ్మీర్‌లో రాజకీయ కదలిక.. 24న ప్రధాని సారథ్యంలో అఖిలపక్ష భేటీ

by Shamantha N |
జమ్ముకశ్మీర్‌లో రాజకీయ కదలిక.. 24న ప్రధాని సారథ్యంలో అఖిలపక్ష భేటీ
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370 నిర్వీర్యం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే నిర్ణయం తీసుకుని రెండేళ్లు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక రాజకీయ మలుపునకు బీజం వేసింది. కశ్మీర్ లోయలోని అన్ని ప్రధాన పార్టీల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమవడానికి నిర్ణయం తీసుకుంది. 24న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని భేటీ కానున్నారు. ఈ భేటీలో కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడంపై చర్చ జరిగే అవకాశముందని సమాచారం. నవంబర్‌లో లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికలే భేటీలో ప్రధాన ఎజెండా అని సంబంధితవర్గాలు వివరించాయి.

రాష్ట్ర విభజన తర్వాత మిగిలిపోయిన అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులను నిర్ణయించే(డీలిమిటేషన్) ప్రక్రియ ఉన్నదని, దీనిపై చర్చిస్తారని తెలిపాయి. ఈ సమావేశానికి తొమ్మిది పార్టీల నేతలకు ఫోన్ చేసి ఆహ్వానించినట్టు సంబంధితవర్గాలు తెలిపినా, ఈ జాబితాలో 16 పార్టీలూ ఉన్నట్టు తెలుస్తున్నది. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. అయితే, దీనిపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించి తనకూ ఆహ్వానం అందిందని చెప్పారు. కశ్మీర్‌కు మళ్లీ 370 అధికరణం పునరుద్ధరణకు పోరాడటానికి స్థానిక పార్టీలన్నీ కలిసి ఏర్పడిన గుప్కార్ అలయెన్స్ కూటమి పాత్రపై చర్చ జరుగుతున్నది. ఈ కూటమి ప్రతినిధుల నుంచి తక్షణమే స్పందన రాకున్నా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయ చర్యలను మొదలుపెట్టినా అందులో పాల్గొని తమ డిమండ్ కోసం పోరాడతామని ఇది వరకే ప్రకటించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed