బీజేపీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్.. ధర్మపురి ఆధ్వర్యంలో ప్రత్యేక నిధి

by Anukaran |
బీజేపీ కార్యకర్తలకు గుడ్‌న్యూస్.. ధర్మపురి ఆధ్వర్యంలో ప్రత్యేక నిధి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధి ప్రతి గ్రామంలోని బూత్ కమిటీ సభ్యుల కుటుంబ సంక్షేమం లక్ష్యంగా.. ఏర్పాటు చేసిన అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ సంక్షేమ ప్రత్యేక నిధిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో.. అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ కార్పస్ ఫండ్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి మాట్లాడుతూ.. చిన్న పిల్లల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం దాదాపు పదేళ్ల కిందట అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ స్థాపించానని గుర్తు చేశారు. దీనిద్వారా ఇప్పటి వరకు150కి పైగా పసివాళ్లను రక్షించామని.. అది తన మనసుకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలన్న ఆలోచనతోనే.. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని బూత్ స్థాయి సభ్యులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం శాశ్వత సంక్షేమ నిధిని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు.

బీజేపీ కార్యకర్తలు కాషాయ జెండా సిద్ధాంతం కోసం అంకితభావంతో పనిచేస్తారన్నారు. అలాంటి కార్యకర్తలు కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులకు గురయ్యారని.. కొందరు ఆసుపత్రి బిల్లులు కట్టలేక ఆర్థికంగా చితికిపోగా.. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారన్నారు. అలాంటి కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి అర్వింద్ ధర్మపురి వెల్ఫేర్ ఫండ్ (కార్పస్ ఫండ్ ) తీసుకొచ్చామన్నారు.

ఈ నిధి ద్వారా సభ్యుల కష్ట – సుఖాలలో వారికి అండగా ఉండాలన్నదే ఏడీఎఫ్ లక్ష్యమన్నారు. ఏడీఎఫ్‌లో సభ్యుడి భార్య, పిల్లలు ఆసుపత్రి పాలైతే చికిత్స తీవ్రతను బట్టి రూ. 5,000 నుంచి రూ. 50,000 వరకు ఆర్థిక సహాయం, సభ్యుడు అకాలమరణం చెందితే ఆ కుటుంబానికి రూ. 1,50,000 అందజేస్తామన్నారు. బాధిత పిల్లల చదువులకు ఆర్థిక సహాయం కూడా అందజేస్తామన్నారు. కష్టాలలోనే కాదు సభ్యుల సంతోషాలలో కూడా ఏడీఎఫ్ పాలు పంచుకుంటోందన్నారు. సభ్యులు సొంత ఇంట్లో గృహప్రవేశం చేసినా.. ఆడకూతురు పెళ్లి చేసినా.. ఫౌండేషన్ ద్వారా రూ. 20 వేలు ఇస్తామన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని దాదాపు 20 వేల మంది సభ్యుల కుటుంబాలకు అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ అండగా నిలవనుందని ఆయన భరోసా ఇచ్చారు.

Next Story

Most Viewed