బీహార్‎లో అధికారంలోకి మళ్లీ ఎన్‌డీఏ: అమిత్ షా

by Shamantha N |
బీహార్‎లో అధికారంలోకి మళ్లీ ఎన్‌డీఏ: అమిత్ షా
X

పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్‌డీఏ తప్పకుండా మూడింట రెండు వంతుల మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్‌జేడీ పాలనలో రాష్ట్ర వృద్ధి రేటు 3.9 ఉండగా, నితీష్ పాలనలో అది 11.3కి పెరిగిందని తెలిపారు. బీహర్‎ లాంతర్ల రాజ్యం నుంచి ఎల్ఈడీలా రాజ్యంగా ఎదిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ‘బీహార్ జన్‌సంవాద్ ర్యాలీ’ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇది రాజకీయపరమైన ర్యాలీ కాదని, రాజకీయాలకు ఇది సమయం కాదని పేర్కొన్న అమిత్ షా కరోనా యోధులను ప్రోత్సహించేందుకే ఈ ర్యాలీ అని తెలిపారు. కరోనాపై పోరాడేందుకు ప్రజలందరినీ ఒకతాటి మీదకు తీసుకువచ్చేందుకే ఈ ర్యాలీ అని చెప్పుకొచ్చారు. మోడీ నాయకత్వంలో అందరూ కరోనా మహమ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీహార్ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లలో జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీహార్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార క్యాంపెయిన్‌ను అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. బీహార్‌లో తప్పకుండా ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసాన్ని ప్రకటించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లో ప్రసంగిస్తూ గత ఆరేళ్లుగా మోడీ ప్రభుత్వం ప్రకటించిన, సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. సర్జికల్ స్ట్రైక్‌ మొదలు అయోధ్యలో రామమందిర నిర్మాణం వరకు చెప్పుకొచ్చారు. ఈ ప్రసంగంలో బీహార్ వలస కార్మికులనూ ప్రస్తావించారు. బీహారీల గురించి పలువురు నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ప్రజలు ముఖ్యంగా వలస కార్మికులు అలాంటి మాటలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి అభివృద్ధి చెందిన రాష్ట్ర పునాదుల్లో బీహారీల సంతకం ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు 1.25 కోట్లమంది వలస కూలీలను మోడీ ప్రభుత్వం సొంతూళ్లకు తరలించిందని, వలస శ్రామికులు రోడ్లపై నడుస్తున్నారని తెలియగానే వారి కోసం బస్సులు, ట్రైన్‌లను ఏర్పాటు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌పై విమర్శలు సంధిస్తూ ఆ పార్టీ 70 ఏళ్లలో స్పృశించని అంశాలను, సమస్యలను మోడీ ప్రభుత్వం రెండో హయాంలోని మొదటి సంవత్సరంలోనే పరిష్కరించిందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed