అంబులెన్సులను అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే రాకతో

by Shyam |   ( Updated:2021-05-14 03:46:40.0  )
అంబులెన్సులను అడ్డుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే రాకతో
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా నిబంధనలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వైద్యం కోసం హైదరాబాద్ కు పేషెంట్లతో బయలుదేరిన అంబులెన్సులను జోగులాంబ జిల్లా అలంపూర్ సమీపంలో ఉన్న పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చిన అంబులెన్స్ లన్నింటిని తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి, తెలంగాణ ఆస్పత్రిలో బెడ్ సౌకర్యం ఉందని తెలిపే పత్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఈ పాస్ ఉన్న అంబులెన్సులను మాత్రమే అనుమతించారు. అలానే బెడ్ అనుమతి ఉన్న, ఈపాస్ లేని అంబులెన్సులను పోలీసులు నిలిపివేశారు. ఉదయం 11 గంటల వరకు వందకు పైగా అంబులెన్సులు పుల్లూరు స్టేజీ వద్ద నిలిచిపోయాయి.

గంటల తరబడి వేచి ఉండడంతో కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో, మిగతా అంబులెన్స్‌లో ఉన్నవారు తమను హైదరాబాద్ కు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని వేడుకున్న ప్రయోజనం లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్సుల లో ఉన్న పేషంట్ లను హైదరాబాద్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయము తమ పరిధిలోది కాదని ఉన్నతాధికారులతో మాట్లాడాలని పోలీసులు తెలియజేయడంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే మాట్లాడిన ప్రయోజనం లేకపోయింది.

దీనితో పరిస్థితులు విషమంగా ఉన్న వారిని ఎమ్మెల్యే అదే అంబులెన్స్ లో కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితులు ఇలా కొనసాగుతుండగానే తెలంగాణ వైపునుండి ఆంధ్రలోకి వెళుతున్న వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పోలీసులు స్పందించి తెలంగాణ పరిధిలో కాదు మీ రాష్ట్ర పరిధిలో చేసుకోండని గట్టిగా చెప్పడంతో తమ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పోలీసులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించడంతో ఆంధ్ర నుండి వచ్చే అంబులెన్స్ లకు అవకాశం ఇవ్వలేదు.

కట్టలు తెగిన ఆగ్రహం:

ఆరోగ్య పరిస్థితులు విషమించిన వారిని కడప, కర్నూలు, అనంతపూర్ తదితర ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ వారిని కాపాడుకోవాలనే తపనతో అంబులెన్స్ లో తీసుకస్తున్నారు. కానీ అంబులెన్స్లో వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో పేషెంట్ల బంధువులు పోలీసులకు పలు విధాలుగా చెప్పే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది. చివరికి కాళ్లు మొక్కుతామని వేడుకున్న కనికరించని పరిస్థితులు, దీనితో అంబులెన్స్లలో ఉన్న పేషెంట్లకు సంబంధించి ఉన్న ఆక్సిజన్ అయిపోతూ ఉండడంతో, పరిస్థితులు విషమిస్తుడడంతో పేషెంట్ల బంధువుల ఆ గ్రహాలు కట్టలు తెంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఇంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ నీకు మా ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. పలువురు పేషెంట్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

వైద్యం కోసం కర్నూలు వెళ్లకూడదు..

గద్వాల, వనపర్తి జిల్లా లో నుండి ప్రజలు పెద్ద మొత్తంలో వైద్యం కోసం కర్నూలు జిల్లా ఆస్పత్రికి వెళ్లేవారు. తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారు ఎవరు కూడా వైద్యం కోసం కర్నూలుకు వెళ్ళకూడదని పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి అయితే గద్వాల, మహబూబ్ నగర్, హైదరాబాద్ కు వెళ్లాలని సూచించారు. మొత్తంపై తెలంగాణ రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed