PMOలో ఏం జరుగుతోంది.. ప్రధాని సలహాదారు అమర్జీత్ సిన్హా రాజీనామా

by Shamantha N |
PMo-Singh
X

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక సలహాదారు అమర్జీత్ సిన్హా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. 1983 బ్యాచ్ బిహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అమర్జీత్ 2019 వరకు పట్టణ అభివృద్ధి కార్యదర్శిగా భారత ప్రభుత్వంలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో ప్రధాని మోడీకి సలహాదారుగా నియామకమయ్యారు.

అప్పట్నుంచీ సామాజిక రంగ పథకాలు, పాలసీలకు సంబంధించిన అంశాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. అయితే, సిన్హా పదవీకాలం ముగియడానికి మరో ఏడు నెలలు ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. పదవి నుంచి సిన్హా వైదొలగిన వెంటనే పీఎంవో అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రత్యేక సలహాదారుల పేర్ల జాబితా నుంచి ఆయన పేరును అధికారులు తొలగించారు.

ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారి భాస్కర్ ఖుల్బే పేరు మాత్రమే లిస్టులో కనిపిస్తున్నది. 2019 నుంచి ఇప్పటివరకు ప్రధాని కార్యాలయంలోని కీలక అధికారులు రాజీనామ చేయడం ఇది మూడోసారి. అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రెటరీ న్రిపేంద్ర మిశ్రా, ప్రిన్సిపల్ అడ్వైసర్ పీకే సిన్హా సైతం తమ పదవులకు రిజైన్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed