- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమటిరెడ్డి ‘బ్రదర్స్’ దారెటు.. ఢిల్లీలో మకాం అందుకోసమేనా..
దిశ ప్రతినిధి, నల్లగొండ : కోమటిరెడ్డి బ్రదర్స్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. వైఎస్ హయాంలో ఇటు పాలనపరంగా అటు రాజకీయపరంగానూ కీలకపాత్ర పోషించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి వరిస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గంపెడాశలు పెట్టుకున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ వరుస వైఫల్యాలు.. ఉత్తమ్‌ను మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి పీసీసీ రేసులో తామున్నామంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పుకొచ్చారు.
ఆ మేరకు ప్రయత్నాలను సైతం ముమ్మరం చేశారు. టీపీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగానే కోమటిరెడ్డి వర్గీయులంతా అలర్ట్ అయ్యారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. టీపీసీసీ బాధ్యతలను మాల్కాజిగిరి ఎంపీ రేవంత్‌కు కట్టబెట్టడంతో కోమటిరెడ్డి వర్గీయుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఇంతకాలం టీపీసీసీ కోమటిరెడ్డికే దక్కుతుందనే ధీమాతో ఉన్న కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది.
కనీస ప్రాధాన్యం దక్కించుకోలేక..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ సీనియర్ నేతలు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ వచ్చారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరనే ప్రతిపాదన వచ్చిన ప్రతీసారీ.. తాము ఉన్నామంటూ ముందుకొచ్చేవారు. నిన్నమొన్నటి వరకు టీపీసీసీ రేసులో ప్రధానంగా వారి పేర్లు విన్పించాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఊహించని షాకిచ్చింది. పార్టీ పరంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కనీస ప్రాతినిధ్యాన్ని దక్కించుకోలేకపోయారు. ఇటు పీసీసీలోనూ.. అటు ఏఐసీసీలోనూ కనీస ప్రాధాన్యతను నిలబెట్టుకోలేకపోయారు. టీపీసీసీ ఇతర కమిటీల్లోనూ చోటు దక్కకపోవడం ప్రస్తుతం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలోనే మకాం..
కొత్త పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో కోమటిరెడ్డి వర్గమంతా నిరాశలో కూరుకుపోయింది. మూడు రోజుల క్రితం ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని, కోమటిరెడ్డికే టీపీసీసీ ఇవ్వనున్నారంటూ ఆ వర్గమంతా పెద్దఎత్తున ప్రచారం చేసింది. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇదిలావుంటే.. కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇప్పటికీ ఢిల్లీలోనే మకాం వేయడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటించినా.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉండడంతో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఉన్నారు.
దీనికితోడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతీ నియోజకవర్గం నుంచి 10 మంది చొప్పున తమ అనుచర నేతలను ఢిల్లీకి పిలిపించుకోవడం చర్చనీయాంశమవుతోంది. శనివారం రాత్రి నుంచి కోమటిరెడ్డి వర్గం నేతలంతా ఢిల్లీ బాటపట్టారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నా.. వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది.