ఆ గ్రామం ‘వాహ్’క్సినేషన్‌లో సక్సెస్

by Shyam |
Mariapuram
X

దిశ, ఫీచర్స్: కొవిడ్ -19 నిరోధానికి దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతుండగా.. ఇప్పటికి కూడా చాలామంది టీకా భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ, సైడ్ ఎఫెక్ట్స్ భయాలతో వ్యాక్సినేషన్‌కు వెనకాడుతున్నారు. అయితే వరంగల్ రూరల్ జిల్లా, గీసుగొండ మండల పరిధిలోని మరియపురం ప్రజలు మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో అర్హత ఉన్న ప్రతీ వ్యక్తి(వయసు 45)కి టీకాలు వేసుకున్న మొట్టమొదటి గ్రామంగా మరియపురం నిలిచింది. గ్రామ సర్పంచ్ అల్లం బాలి రెడ్డి.. గ్రామ సభ్యులందర్నీ ఏకం చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేశాడు.

మరియపురంలో 800 జనాభా ఉండగా, వీరిలో 45 ఏళ్లు పైబడిన వ్యక్తులు 314 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్‌ బాధ్యత తీసుకున్న బాలిరెడ్డి.. అర్హత ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించడానికి వలంటీర్లను నియమించాడు. ఆ వివరాలతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, కమ్యూనికేట్ చేయడంతో పాటు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ మేరకు గ్రామస్తులు ఒప్పుకోవడంతో రోజుకు 60 మంది చొప్పున టీకా తీసుకునేందుకు స్లాట్లు కేటాయించి, వారిని టీకా కేంద్రానికి తీసుకెళ్లేందుకు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు.

వ్యాక్సిన్ వేసుకోవాలని డాక్టర్లు, ప్రభుత్వాధికారుల చెబుతున్నా మా గ్రామంలో స్వయంగా ఎవరూ ముందుకు రాలేదు. అందుకని మొదట నేనే టీకా తీసుకోవాలని నిర్ణయించుకుని, ఫస్ట్ డోస్ తీసుకున్న ఫొటోను గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాను. రెండు రోజుల తర్వాత, కొంతమంది ముందుకొచ్చారు. అయితే కొందరిలో మాత్రం టీకా తీసుకోవడంపై అనుమానాలు, భయాలు ఉండటంతో వ్యాక్సినేషన్‌పై అవగాహన ఏర్పరిస్తే అందరూ తప్పకుండా టీకా తీసుకుంటారని భావించా. ఈ క్రమంలో ఆరోగ్య అధికారులను సంప్రదించి వ్యాక్సినేషన్ గురించిన పూర్తి వివరాలను సేకరించి, ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు వలంటీర్లను నియమించాను. మా వలంటీర్లు పూర్తి అంకితభావంతో సభ్యుల సందేహాలను తీర్చడంతో పాటు విజయవంతంగా ఈ పనిని పూర్తి చేశారు. దాని ఫలితమే ఇది. ఇప్పుడు రెండో డోస్ తీసుకునేందుకు గ్రామ సభ్యులందరం వెయిట్ చేస్తున్నాం.

– బాలి రెడ్డి, సర్పంచ్, మరియపురం

Advertisement

Next Story