మెడపై వేలాడే కత్తి.. డూమ్స్‌డే స్క్రోలింగ్!

by Sujitha Rachapalli |
మెడపై వేలాడే కత్తి.. డూమ్స్‌డే స్క్రోలింగ్!
X

దిశ, ఫీచర్స్ : ప్రజలు చాలా మంది కొవిడ్-19 గురించి నిరంతరం వార్తలు వింటూనే ఉన్నారు. అయితే, ఇందులో కొన్ని ఫేక్‌ న్యూస్ జనాలకు లేనిపోని భయాందోళనలతో ఒత్తిడిని పెంచేస్తున్నాయి. అందులో భాగంగానే.. ఓ ఐటీ ఎంప్లాయ్‌ శ్రీకాంత్‌కు వాళ్ల పక్క ఫ్లాట్‌లో అంకుల్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. అదే సమయంలో వాళ్ల బంధువుల అబ్బాయి కరోనాతో మరణించాడనే వార్త అతడి మనసులో పిడుగుపడేలా చేసింది. అంతే శ్రీకాంత్ భయంతో వణికిపోయాడు. కరోనా వచ్చిందిని అపోహ పడ్డాడు. అన్ని టెస్ట్‌లు చేయించుకున్నా అనుమానం మాత్రం వీడలేదు. సోషల్ మీడియాలో ‘కొవిడ్’పై కూపీ లాగడం మొదలుపెట్టాడు. ఏ ప్లాట్‌ఫామ్‌లో కొవిడ్ న్యూస్ వచ్చినా.. ఆ పద్ధతులను ‘ఫాలో’ అవడం మొదలుపెట్టాడు. సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూనే అనవసరంగా టెన్షన్ పడి నిద్ర పోకుండా ఆరోగ్యం పాడుచేసుకున్నాడు. అయితే ఇది శ్రీకాంత్ ఒక్కడి కథే కాదు. మన చుట్టూ ‘పది’మందిలో ఏడుగురు ఇలాంటి నెగెటివ్ న్యూస్‌తోనే పానిక్ అయిపోతున్నారు.

కొవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా ఎంతటి మారణహోమాన్ని సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. కానీ అదే కొవిడ్ కోరలు పీకేసి దాన్ని జయించిన వయోధిక వృద్ధులు, పసిపాపలు, రియల్ హీరోలు ఎంతోమంది మనమధ్యలోనే ఉన్నారు. అయినా ఎప్పుడూ ‘మంచి’ మన చెవికెక్కదు. నెగెటివిటీ ఫాలోవర్స్ కదా మనమంతా. మనలో చాలా మంది మహమ్మారికి సంబంధించిన వార్తలు, వీడియోలను సోషల్ మీడియా ఫీడ్ ద్వారా నిరంతరం స్క్రోలింగ్ చేస్తున్నారు. దీన్నే “డూమ్‌ స్క్రోలింగ్” లేదా “డూమ్స్‌డే స్క్రోలింగ్” అంటారని బిహేవిరియల్ ఎక్స్‌పెర్ట్స్ చెబుతున్నారు. ఇది చెడు వార్తలను సర్ఫ్ చేయడం లేదా స్క్రోల్ చేయడం కొనసాగించే ధోరణిని ఇది సూచిస్తుంది. ఇది రెండు వైపుల(డబుల్ ఎడ్జ్) పదునున్న కత్తి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ ఆపత్కాలంలో ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన రిసోర్సెస్ అందిస్తూ సాయం చేస్తున్న సోషల్ మీడియా.. మరో వైపు వినాశనం(డూమ్స్) దిశగా మన ఆలోచనలను మళ్లిస్తోంది.

ఏం చేయాలి?

మనలో చాలా మందికి ఆచరణాత్మకంగా కష్టమైనప్పటికీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. కొన్ని రోజుల పాటు యాప్స్ వాడకపోవడం ఉత్తమమైన మార్గమని బిహేవియర్ నిపుణులు సూచించారు. లేదా మొబైల్ ఆఫ్ చేయకపోయినా కనీసం అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో నోటిఫికేషన్లను ఆపేసినా మంచిదేనన్నారు. మనస్సుకు ప్రశాంతత కోసం ధ్యానం చేయటం, మ్యూజిక్ వినటం లేదా బొమ్మలు వేయటం, కవితలు రాయటం ఏదైనా.. మీకు ఇష్టమైన పని చేస్తే ఆనందం కలుగుతుంది. ఇలా నెగెటివ్ ప్లేస్‌లో పాజిటివిటీని రిప్లేస్ చేస్తే కొవిడ్ భయాల నుంచే కాదు అంతకుమించిన ఆందోళలను కూడా తేలిగ్గా తీసిపారేస్తారని అంటున్నారు నిపుణులు.

మనలోని శక్తి యుక్తులు ఎవరో చెబితే గుర్తించేవి కాదు. స్వతహాగా వచ్చినవి. కష్ట సమయాల్లోనే మన బలాలు, బలహీనతలు బయటకు పడతాయి. కరోనా తరిమికొట్టే ఆయుధాలు ఎక్కడో సంజీవని పర్వతంలోనో, సకల వసతుల ఆస్పత్రుల్లోనే లేవు. మన శరీరంలోనే పుష్కలంగా ఉన్నాయి. భయంకర రోగాలను సైతం ఎదురించే ‘ఇమ్యూనిటీ’ మన సొంతం. మన శరీరమే అద్భుతమైన ఆయుధాగారం. ఎక్కుపెట్టి దాడి చేయాలేగానీ ఒక్క కొవిడ్ కణం కూడా మన ఒంట్లోకి వచ్చే ధైర్యం చేయదు. అది జరగాలంటే ఎదురించే ధైర్యం, ఓడించే సంకల్పాన్ని అంతకుమించి మన శరీరంపై మనకు నమ్మకాన్ని పెంచుకోవాలి. అందుకు తగ్గట్లుగా మైండ్ ప్రిపేర్ చేయాలి.

జాగో.. సబ్‌సే మజ్‌బూత్ ఆద్మీ.. జాగో!

డూమ్స్ స్క్రోలింగ్ ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. ఇది వరల్డ్‌వైడ్ ఫినామినా. అందరూ సర్ఫింగ్ చేస్తున్నారు. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కారణాలతో బ్యాడ్ న్యూస్ వల్ల ప్రభావం అవుతున్నారు. 15-30 ఏళ్లలోపు వారు సహాయం కోరడానికి, వనరులను పంచుకునేందుకు స్క్రోలింగ్ చేస్తుండగా, 30-45 ఏళ్ల వయసు వాళ్లు అందరినీ నిందించడానికి ఎక్కువగా సోషల్ మీడియా వాడుతున్నారు. ఇక సీనియర్ సిటిజన్స్ మాత్రం ఆధ్యాత్మికత, పాజిటివిటీని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

– డాక్టర్ సిద్ధార్థ్ చౌదరి, విమ్‌హాన్స్ కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ – ఢిల్లీ

‘డూమ్స్ స్క్రోలింగ్‌ని బిహేవియరల్ అడిక్షన్‌గా చెప్పొచ్చు. పాజిటివ్ న్యూస్ మనకు డోపమైన్ అధికంగా ఇస్తుందనే విషయం తెలుసు. అలాగే నెగెటివ్ న్యూస్ కూడా డోప‌మైన్ రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్ రియాక్షన్ వల్ల అది సెల్ఫ్ సస్టెనింగ్ యాక్టివిటీగా మారుతుంది. మనుషులుగా ఇది మనకు విపత్తు కలిగించే ధోరణే. దీనివల్ల చెడు న్యూస్ పదేపదే చూసే అలవాటు పెరిగిపోతుంది. అలానే సోషల్ మీడియాలో అల్గారిథమ్స్ మనం సెర్చ్ చేసిన అంశాల ఆధారంగా, మన ఆసక్తికి అనుగుణంగా ఉన్న ఫీడ్‌నే అందిస్తాయి. దాంతో మన పరిస్థితి మరింత దిగజార్చడానికి దారితీస్తుంది. డూమ్స్ స్క్రోలింగ్ ప్రతికూల ఆలోచనలను, మనస్తత్వాన్ని బలోపేతం చేయగలదు. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. దీనివల్లే మనలో ఎక్కువ భయం, ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో కొవిడ్ రిలేటెడ్ ఫీడ్‌ చదివితే.. అది ఎంతవరకు విశ్వసనీయం, దాన్ని ఎవరు ధ్రువీకరించారో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి’.

-డాక్టర్ నిమేష్ దేశాయ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ డైరెక్టర్ – ఢిల్లీ

Advertisement

Next Story

Most Viewed