- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందు, కల్లు లేక మైండ్ బ్లాక్!
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా చిటికెస్తే వారి బతుకులు ఛిద్రమయ్యాయి. కరోనా వికటాట్టహాసానికి వారి కుటుంబాలు నవ్వులపాలయ్యాయి. కరోనా కరాళనృత్యానికి వారి బతుకులు తడబడ్డాయి. కరోనా.. కల్లు కూడబలుక్కున్నాయి. వారి కుటుంబాలను కూల్చేస్తున్నాయి. పెనుమంటలు సృష్టించి కాల్చేస్తున్నాయి. కొందరు చితికిపోతున్నారు. మరికొందరు ‘చితి’ మంటలకు చిక్కుకుపోతున్నారు. ఒకరు ట్రాన్స్‌ఫార్మర్‌ను ముట్టుకొని చనిపోతే, మరొకరు గొంతుకోసుకొని విగతజీవిగా మారారు. ఇంకొకరు ఊరేసుకొని ఊపిరితీసుకున్నారు. కరోనా, కల్లు కలిసిపోయి.. భార్యకు భర్తను దూరం చేస్తున్నాయి. పిల్లలకు తండ్రిని లేకుండా చేస్తున్నాయి. ‘ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు’ కరోనా.. అడ్డాకూలీలు, భవననిర్మాణ కార్మికులు.. హమాలీ వర్కర్స్, ఇతర చిన్నా, చితక కుటుంబాల్లో నిప్పులుపోసింది. కరోనా.. వారి బతుకుల్లో చిచ్చుపెట్టింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో కల్లు దొరక్క కొందరు కళ్లు తేలేస్తున్నారు. మద్యం లభించక మరి కొందరు మధ్యంతరంగా తనువులు చాలిస్తున్నారు. పలువురు మానసిక రోగులుగా మారారు. వాళ్ల పిచ్చిచేష్టలకు కుటుంబ సభ్యులు చేష్టలుడిగిపోతున్నారు. కరోనా… చాలామంది బతుకులను ఖరాబు చేసింది. గరీబుల నిండు జీవితాలను ఖరీదు చేసిన షరాబు అయింది.
‘ నాలుగు రోజులుగా కల్లు, మద్యం దొరక్కపోవడంతో మా నాన్న ఇంట్లోని టీవీ, మొబైల్ పోన్ పగుగొట్టాడు. గిన్నిలను అడ్డగోలుగా విసిరేశాడు. రోడ్ల మీద పరుగులు తీస్తున్నాడు.. మేముండేది అద్దెంట్లో.. తిరిగి వెళ్లినంక వాళ్లు ఇంట్లో ఉండనిస్తరో.. లేదో..’ ఇది ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో తన తండ్రిని జాయిన్ చేసిన కన్నీళ్లతో పవన్ (14) చెబుతున్న వేదన.. తండ్రితోపాటు అమ్మమ్మకు కూడా మద్యం అలవాటు ఉంది. వారిద్దరూ ఇప్పుడు చికిత్స పొందుతున్నారు.
‘మందు దొరకకపోవడంతో రంగారెడ్డిలో ఒకరు, సిద్దిపేటలో ఒకరు ట్రాన్స్ఫార్మర్ ముట్టుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అందులో ఒకరికి చేతులు కాలాయి.. మరొకరు చనిపోయారు. సంగారెడ్డిలో ఒకతను బట్టలు విప్పుకొని ఇల్లు మరిచిపోయి రోడ్లు పట్టుకు తిరిగాడు. కుటుంబ సభ్యులు రోజంతా కష్టపడి ఇంటికి తీసుకెళ్లారు. ఇలా ఒక్కరూ, ఇద్దరూ కాదు.. రాష్ట్రంలో వేల మంది మద్యం, కల్లు అలవాటుపడిన వారి పరిస్థితి లాక్‌డౌన్ తర్వాత అగమ్యగోచరంగా మారిపోయింది. ఇంట్లో గొడవలు, భార్యలను కొట్టడం, వాదనలు పెట్టుకోవడం, అన్ని మర్చిపోయి ఎక్కడికి వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కసారిగా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని దోమలగూడకు చెందిన కమల వాపోతున్నారు. అందరి మంచి కోసమే నిర్ణయం తీసుకున్నా.. మాలాంటి వాళ్ల గురించి ఆలోచించి చేస్తే మంచిగుండేదని ఆమె అంటున్నారు.’
కరోనా వచ్చింది బలిసినోడు దేశాలు తిరగడం వల్ల.. మా ఊళ్లనే ఉండి పొద్దంతా పనిచేసి, సాయంత్రం ఇంటికెళ్లే మాకెందుకీ ఖర్మా.. అనుకుంటూ శ్రమజీవులు ఆవేదన చెందుతున్నారు. రోజు చేసే కూలీ పాయే.. తిండి దొరకడం లేదాయో.. ఊరికి పోదామంటే కట్టడి చేసుడాయే.. రోజంతా పనిచేసి శ్రమను మరిచిపోయేందుకో ఓ రెండు సీసాల కల్లో.. చీప్ లిక్కరో.. పావు సేరో తాగితేనే తప్ప నిద్ర పట్టని వాళ్లంతా ఇప్పుడు పిచ్చివాళ్లుగా మారిపోతున్నారు. రోగాన్ని తీసుకొచ్చినవాళ్లనేమో స్పెషల్ రూంల పెట్టి అన్ని పెడుతున్నరంటా.. మా కడుపులు కొట్టి మాకు నిద్రలేకుండా చేస్తే మీకేమొస్తది అని వారంతా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు కనిపించడం లేదు.
అడ్డా కూలీలుగా, హమాలీ, ప్లంబింగ్, దినసరి కూలీలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారు, చిన్నాచితకా వీధి వ్యాపారులు చేసేవారు, ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారిలో ఎక్కువ మందికి సాయంత్రం కల్లు దుకాణానికో, మద్యానికో అలవాటు ఉంది. తమ శ్రమను మరిచిపోయి ప్రశాంతంగా పడుకునేందుకే ఇది తప్ప.. తాగి ఆరోగ్యాలకు ఖరాబు చేసుకోవడం తమకేమైనా ఇష్టమా అంటుంది సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ. పురుషులైనా, స్ర్తీలైనా తమ రోజూ వారీ సంపాదనలో 100– 200 వరకూ సాయంత్రం పూట ఈ తాగుడుకు కచ్చితంగా కేటాయించడం పరిపాటి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఒక్కసారిగా మద్యం, కల్లు దుకాణంలో బంద్ చేయడంతో వీరంతా మానసిక ధృడత్వం కోల్పోతున్నారు. వీటిల్లో వాడే మత్తు, ఇతర రసాయన పదార్థాలకు అలవాటు పడినవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆల్కహాల్‌కు బానిసైన వారిలో ఒక్కసారిగా మానివేస్తే ఇలాంటివి జరగడం సహజమే అయినా.. ఎప్పటివరకూ ఈ పరిస్థితి ఉంటుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా మానివేసినపుడు వీరిలో కాళ్లు, చేతులు వణకడం, భయం, ఆందోళన కలగడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని రోజుల్లోనే వీరు మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా ప్రవర్తించడం, అరవడం, మనుషులపై దాడి చేయడం చేస్తుంటారు. తొందరగా అలసిపోవడం, ఫిట్స్, మతిమరుపు, ఎక్కడికో వెళ్లిపోతుండటం వంటివి చేస్తుంటారు. చివరకు ప్రాణాలు కూడా కోల్పోతారు. నాడీ వ్యవస్థ, మెదడు దెబ్బతినడంతో పాటు అప్పటికే శరీరంలోని ఇతర భాగాలకు ఏదైనా వ్యాధులు ఉంటే ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇలా మద్యానికి అలవాటు ఉన్నవారి గురించి ముందస్తుగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో రాష్ట్రంలోని కల్లు దుకాణాలన్ని మూసీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఇలాగే మతిస్థిమితం కోల్పోయి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యాయి, కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. కూలి చేస్తేనే గాని పూట గడవని వీరికి మద్యం ఒక వ్యాపకం. అది ఒక్కరోజు లేకుంటే నిద్రరాని వారే కాదు.. సరిగా నిలబడేస్థితి కూడా ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇలాంటివారున్నారు. వీరి గురించి కూడా ప్రభుత్వం జాగ్రత చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.
ఎర్రగడ్డ ఆస్పత్రికి రోగుల తాకిడి
కల్లు, మద్యం దొరకక అనారోగ్యానికి గురైనవారితో ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సోమవారం ఒక్కరోజులోనే 107 కేసులు రిజిస్ట్రర్ అయ్యాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వీరంతా హైదరాబాద్ స్థానికత గలవారే.. జిల్లాల్లో వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో కొందరిని చికిత్స అనంతరం ఇంటికి పంపించివేయగా.. 40 మందిని ఇన్‌పేషంట్లుగా జాయిన్ చేసుకున్నారు.
ముందస్తు చికిత్స అవసరం
నగరంతో పాటు జిల్లాల్లోనూ ప్రతీ రోజూ మద్యం, దుకాణాలకు వెళ్లేవారు ఉన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపించకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు చికిత్స అవసరం. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో సైక్రియాట్రిస్టులు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ మానసిక నిపుణులు ఉన్నారు. తీవ్రత పెరగకుండా వారి నుంచి చికిత్స తీసుకోవాలి. ఆల్కహాల్ దొరకని సందర్భాల్లో వచ్చే లక్షణాలతో పాటు ఇతర శారీరక సమస్యలు ఉంటే వారి ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ సహా రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో వైద్యులు ఉన్నారు. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోనూ 600 బెడ్లు ఉండగా.. ఒకేసారి 200 మంది వచ్చినా మద్యం సంబంధ కేసులకు ట్రీట్‌మెంట్ చేయగలమని ఆస్పత్రి సూపరింటెండెంట్ వివరించారు.
ఇక్కడి వరకూ రావాల్సిన అవసరం లేదు – ఉమాశంకర్, సూపరింటెండెంట్, మానసిక చికిత్సాలయం
మానసిక సంబంధ వ్యాధులు అనగానే అందరూ ఇక్కడికే వస్తామని ఆలోచిస్తారు. ఆయా జిల్లా ఆస్పత్రుల్లోనూ సైక్రియాట్రిస్టులు అందుబాటులో ఉన్నారు. మద్యం, కల్లు ఒక్కసారిగా దొరకకపోవడంతో మానసిక, శారీరక ప్రవర్తనలో మార్పులు కలుగుతున్నాయి. మొదటి దశలోనే ఉన్నపుడు, మామూలుగా ఉన్నా సరే చికిత్సను అందించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించవచ్చు. కుటుంబసభ్యులు గమనించి ఇలాంటి వారికి స్థానికంగా చికిత్స అందించాలి. ఒకవేళ అప్పటికీ అదుపులోకి రాకుంటే వారే ఇక్కడికి పంపిస్తారు. మన ఆస్పత్రిలో మానసిక చికిత్స అందించేందుకు అవసరమైన మేరకు వసతులు, వైద్య సిబ్బంది ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే చికిత్స చేసేందుకు మీకు దగ్గరలోనే సదుపాయం ఉంది. వాటి గురించి తెలుసుకొని సంప్రదించాలని ప్రజలను కోరుతున్నాం..
Tags : Health, erragadda, mental, hyderabad, alcohol