50ఏండ్ల తర్వాత టెస్ట్ క్రికెటర్‌గా గుర్తింపు

by Shyam |
50ఏండ్ల తర్వాత టెస్ట్ క్రికెటర్‌గా గుర్తింపు
X

దిశ, స్పోర్ట్స్: 50ఏండ్లు పోరాడిన తర్వాత ఓ క్రికెటర్‌కు టెస్టు క్రికెటర్ హోదా లభించింది. అతను ఆడిన మ్యాచ్ టెస్టు కాకపోయినా ఆ హోదాను మాత్రం ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) కట్టబెట్టింది. వివరాల్లోకి వెళితే ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ అలాన్ జోన్స్ ఎన్నో ఫస్ట్ క్లాస్, కౌంటీ మ్యాచ్‌లు ఆడాడు. 1970లో ఇంగ్లాండ్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌కు జరిగిన టెస్టు మ్యాచ్‌ అతని జీవితంలో ఏకైక టెస్టు మ్యాచ్. కాగా, కొన్నాళ్ల తర్వాత ఐసీసీ ఆ మ్యాచ్‌కు టెస్టు హోదాను రద్దు చేసింది. దీంతో జోన్స్‌కు టెస్టు క్రికెటర్ అనే హోదా కూడా పోయింది. ఆనాటి నుంచి అతను ఈసీబీని తనకు ఆ హోదా కల్పించమని కోరుతూనే ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ జరిగి 50ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈసీబీ అలాన్ జోన్స్‌కు టెస్ట్ క్రికెటర్ హోదాను కట్టబెట్టింది. అంతేకాకుండా టెస్టు క్రికెటర్‌కు ఇచ్చే వరుస క్రమం ప్రకారం ప్రస్తుతం 696 నెంబర్‌ను అతనికి కేటాయించింది. ఇంగ్లాండ్ జట్టు క్యాప్‌పై ఆ నెంబర్‌ను ముద్రించి ఈసీబీ చైర్మన్ కొలిన్ గ్రీవ్స్ చేతుల మీదుగా అలాన్ జోన్స్‌కు అందించారు. ‘అలాన్ జోన్స్‌కు టెస్ట్ క్యాప్ అందించినట్లు రికార్డు పుస్తకాల్లో ఎక్కడా నమోదు కాలేదు. అందుకే అతనికి 696 నెంబర్ క్యాప్ ఇచ్చాం’ అని ఈసీబీ స్పష్టం చేసింది. కాగా 645 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జోన్స్ 56 సెంచరీలతో 36,049 పరుగులు చేశాడు. తన కోరిక తీర్చి, టెస్ట్ క్రికెటర్‌గా గుర్తించినందుకు అలాన్ సంతోషం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story