అహ్మదాబాద్‌లో 334మంది ‘సూపర్-స్ప్రెడర్స్’

by vinod kumar |
అహ్మదాబాద్‌లో 334మంది ‘సూపర్-స్ప్రెడర్స్’
X

గాంధీనగర్: భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తోన్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) కొత్త రూపు తీసుకుంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసేలా ఆ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మొదట్లో ఈ వ్యాధి సోకిన వారికి లక్షణాలు కనిపించేవి. కానీ, ఇప్పుడు అవి కూడా కనిపించకుండా విపరీత వ్యాప్తికి కారణమయ్యే ముప్పు పొంచి ఉంది. వ్యాధి ఉన్నట్లు ఆనవాళ్లు తెలియకుండానే, వారు పరోక్షంగా జబ్బు సోకేందుకు దోహదపడుతున్నారు. వారే సూపర్ స్ప్రెడర్స్ లేదా వైరస్ క్యారియర్స్.

పాలు అమ్మేవారు మొదలుకుని కూరగాయలు విక్రయించేవారు, కిరాణా దుకాణాల్లో పనిచేసేవారు, చెత్త సేకరించేవారు, పెట్రోల్ బంకులో పనిచేసేవారు.. ఇలా ఎవరైనా సూపర్ స్ప్రెడర్స్‌గా ఉండొచ్చు. అలాంటి వారే గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌లో 334మంది బయటపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ ఈ నెల 15వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు కూడా మూసివేయాలని ఆదేశించారు.

శనివారం వరకు గుజరాత్‌ వ్యాప్తంగా 7,797 కరోనా పాజిటివ్ కేసులు, 472మరణాలు నమోదవ్వగా, ఒక్క అహ్మదాబాద్‌లోనే 5,540 కరోనా కేసులు, 363మరణాలు సంభవించాయి. అహ్మదాబాద్‌లో కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ స్థాయిలో కేసులు పెరగడానికి సూపర్ స్ప్రెడర్సే ప్రధాన కారణమని అధికారులు నిర్ధారించారు.

అంతేకాకుండా అక్కడ మరో 14వేల మంది అత్యంత ప్రమాదకరమైన సూపర్ స్ప్రెడర్స్‌గా మారారని అధికారులు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లోనూ వీరందరినీ మూడు రోజుల్లో గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ‘అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్’ (ఏఎంసీ) ఏప్రిల్ 20నుంచే సూపర్ స్ప్రెడర్స్‌ను కనుగొనే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3,817 మంది సూపర్ స్ప్రెడర్స్ అనుమానితులను పరీక్షించగా, 334మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో పట్టణంలోని వెజల్‌పూర్ ఏరియాకు చెందిన ఓ కిరాణా షాపు యజమాని ఉన్నారు. దీంతో గత 15రోజులుగా ఈ షాపునకు వచ్చిన కస్టమర్లందరినీ గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.

అహ్మదాబాద్ శివారు ధోల్కా ప్రాంతంలో పుచ్చకాయలు అమ్ముకునే వ్యక్తికి పాజిటివ్ రావడంతో అతనితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కలిగిన 96మందిని క్వారంటైన్ చేయగా, వారిలో 12మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా అధికారి అరుణ్ మహేశ్ తెలిపారు.

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది. సూపర్ స్ప్రెడర్స్ అనుమానితులందరినీ మంగళవారం వరకూ పరీక్షించనున్నట్టు ప్రత్యేక అధికారి రాజీవ్ గుప్తా తెలిపారు. అప్పటివరకూ పట్టణమంతా కఠినమైన లాక్‌డౌన్‌లో ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed