వానకాలం విత్తనాలు సిద్ధం…

by Shyam |   ( Updated:2020-05-11 10:29:15.0  )
వానకాలం విత్తనాలు సిద్ధం…
X

దిశ, మహబూబ్‌నగర్: కరోనా కాలం కావడంతో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రానున్న వర్షాకాలంలో రైతులకు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచే విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలకరి జల్లు కురవగానే సాగు పనులు ఉపందుకోనున్నాయి. మే నెల చివరి నుంచి విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేస్తారు. గత వర్షాకాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం, ఏఏ పంటలు ఎంత సాగు చేశారనే దానిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. గత రెండు సీజన్లలో సాగు గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత పెరగడంతో పాటు చెరువులు, కుంటల అభివృద్ధి కారణంగా చాలా మంది రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతుండడంతో వ్యవసాయ విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోందని అధికారులు అంటున్నారు. గత రబీలో 2లక్షల 50వేల హెక్టార్లలో వరి సాగు కాగా.. ఈ ఏడాది రబీలో 3లక్షల 40వేల హెక్టార్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాలంలో కూడా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి వర్షాకాలం రైతులు అధికంగా వరి, పత్తి, ఆముదం, మొక్కజొన్న, జొన్న, కందులు, వేరుశనగ, శనగ పంటలు సాగు చేస్తుంటారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన విత్తనశుద్ధి కేంద్రం నుంచి మే 15 తరువాత ఆయా జిల్లాల వారీగా అధికారులు ఇచ్చే నివేదికలకు అనుగుణంగా విత్తనాలను తరలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాను యూనిట్‌గా తీసుకుని స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా జిల్లాలకు కావాల్సిన మేర విత్తనాలను పంపించనున్నారు. తరువాత మండలాలకు పంపేలా చూస్తున్నారు. ఇప్పటికే అధికారులు 47వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు నాలుగు రకాల వరి విత్తనాలకు సంబంధించి సుమారు 20వేల క్వింటాళ్లు, 6వేల క్వింటాళ్ల శనగ, 2500 క్వింటాళ్ల కందులు, 5వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సిద్ధం చేశారు. అయితే ఆముదం, పత్తి, మొక్కజొన్న వంటి విత్తనాలను వివిధ ప్రైవేటు సంస్థల ద్వారా సబ్సిడీపై అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే రైతులకు కావాల్సిన జీలుగు, జనుము వంటి ఎరువులను అధికారులు సిద్ధం చేశారు.

Advertisement

Next Story

Most Viewed