తివాచీలపై.. దశాబ్ధాల అఫ్గాన్ చిత్రాలు

by Shyam |   ( Updated:2021-08-31 11:08:49.0  )
tivachi
X

దిశ, ఫీచర్స్ : ఉత్తర అఫ్గానిస్తాన్‌లోని ‘తుర్క్‌మెన్’ నేత కార్మికులు వేలాది సంవత్సరాలుగా తివాచీలు నేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ వస్త్రాలు సాంప్రదాయ జానపద మూలాంశాలతో కూడిన చిత్రాలతో ఉండేవి. ఇటీవల కాలంలో అనేక ఆధునిక డిజైన్‌లతో పాటు పికాసో చిత్రాల ప్రతిరూపాలు, అమెరికన్ జెండాల వంటి ప్రతిరూపాలు కూడా ఆ వస్త్రాలపై ఆవిష్కృతమవుతున్నాయి. కానీ అఫ్గాన్ నేలపై జరిగిన నెత్తుటి ధారలు ఆ రగ్గులపై ప్రతిబింబిస్తుంటాయి.

afganisthan

తొలి నుంచి అఫ్గానిస్తాన్ పరాయి పాలనలో ఉండిపోంది. అయితే ఆధునిక అఫ్గాన్ చరిత్ర 200 ఏళ్ల క్రితం మొదలుకాగా ఆ సమయంలో గ్రామ నాయకుల ఆధ్వర్యంలోనే పాలన సాగింది. ఆ తర్వాత మొదటి ఆంగ్లో – అఫ్గాన్ యుద్ధంతో అక్కడ మరోసారి రక్తపాతం జరిగింది. అలా బ్రిటీషర్ల నుంచి నేటి తాలిబన్ల దాకా అక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. శతాబ్దాల యుద్ధం, హింస, అఫ్గాన్ రోజువారీ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేశాయి. చివరకు పువ్వులు, పక్షులు, గుర్రాలతో ప్రకృతి అందాలతో తివాచీలుచేసే నేతకార్మికులు కూడా ఆ భీతావాహ పరిస్థితులకు లోనయ్యారు.

దాంతో రమణీయమైన డిజైన్ల స్థానంలో మెషిన్ గన్స్, కలష్నికోవ్ రైఫిల్స్, గ్రెనేడ్‌లు, హెలికాప్టర్లు, ట్యాంకు వంటి యుద్ధ చిహ్నాలను చేర్చడం ప్రారంభించారు. అయితే ప్రారంభ సంవత్సరాల్లో బ్రోకర్లు, వ్యాపారులు తమ వర్తకాన్ని నిలిపేస్తారనే భయంతో యుద్ధసంబంధిత డిజైన్లతో రూపొందిన రగ్గులను కొనుగోలు చేయడానికి నిరాకరించారు. కానీ కాలక్రమేణా రగ్గులు, కార్పెట్‌లకు ప్రజాదరణ పెరగడంతో పాశ్చాత్య దేశాల్లో మార్కెట్‌ ఏర్పడింది. తోటి అఫ్గాన్ ప్రజల కోసమే మొదటి వాటిని రూపొందించినా, ఆ తర్వాత పాశ్యాత్య పర్యాటకులను అవి ఆకర్షించడంతో వాణిజ్యపరంగా అధికమొత్తంలో తయారుచేశారు.

afgan

అమెరికాపై ఉగ్రవాదుల దాడి తర్వాత సోవియట్ ఆయుధాలు కనిపించే ఉన్ని కాన్వాసులపై ఇప్పుడు యూఎస్ ఆయుధాలైన ఎఫ్ -16, అబ్రమ్స్ ట్యాంక్స్‌లతో పాటు ‘హీట్ టు వార్’ వంటి నినాదాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి జ్ఞాపకార్థంగానూ రగ్గులు, కార్పెట్స్ రూపొందించగా సాధారణం జనాలు వాటిని కొనుగోలు చేయకపోయినా, కొంతమంది హిస్టరీ అండ్ వెస్టర్న్ కలెక్టర్స్ వాటిని కొన్నారు. దాదాపు 1.6 మిలియన్ల మంది అఫ్గాన్లు కార్పెట్ వ్యాపారంలో ఉండగా.. వీళ్లలో ఎక్కువ మంది మహిళలే. తరతరాలుగా వివక్ష, అణిచివేతకు గురవుతున్న ఈ మహిళలు తమ గొంతు వినిపించడానికి ‘తివాచీ’లను మాధ్యమంగా చేసుకున్నారు.

Advertisement

Next Story