బయటకు వస్తే చర్యలు తప్పవు: తెలంగాణ కొత్త జీఓ

by Shyam |   ( Updated:2020-03-23 08:53:54.0  )
బయటకు వస్తే చర్యలు తప్పవు: తెలంగాణ కొత్త జీఓ
X

దిశ, న్యూస్ బ్యూరో: అత్యవసర హెల్త్ కేర్ అవసరముంటే తప్ప రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయట తిరగడానికి అనుమతించమని ప్రభుత్వం ప్రకటించింది. టూ వీలర్ మీద ఒకరికంటే ఎక్కువ ప్రయాణించడానికి వీలు లేదని తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరిన్ని నిబంధనలు విధించింది. లాక్‌డౌన్‌పై ఆదివారం ఇచ్చిన జీవో నం.45కు అదనంగా రాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సోమవారం జీవో నం.46 జారీ చేసింది. ఆస్పత్రులు, ఫార్మసీలు తప్ప ఏ షాపును రాత్రి 6.30 తర్వాత తెరచి ఉంచడానికి వీలు లేదని తెలిపింది. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ప్రజలు తమ నివాస ప్రాంతాల నుంచి 3 కి.మీ దూరానికి మించి ప్రయాణించకూడదని ఆదేశించింది. ఇన్సూరెన్స్ సర్వీసు ప్రొవైడర్లు తమ రోజువారి విధులు నిర్వహించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది. లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక చెక్ పోస్టులేర్పాటు చేయడానికి పోలీసులకు అనుమతిచ్చింది. కాగా, కరోనా వ్యాప్తి నిరోధం కోసం పనిచేసే వారికి ఈ ఆంక్షలు వర్తించవని తెలిపింది.

నిత్యావసరాలపై కమిటీ..

కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో అందరికీ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం పలు విభాగాల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వం వహిస్తారని తెలిపింది. ఈ కమిటీలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, ఐజీ హైదరాబాద్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, హార్టీకల్చర్ డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం జీవో నం. 46లో పేర్కొంది.

Advertisement

Next Story