అదానీ చేతికి గంగవరం పోర్టు!

by Harish |   ( Updated:2021-03-23 04:08:10.0  )
అదానీ చేతికి గంగవరం పోర్టు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్‌లో ఉన్న గంగవరం పోర్ట్ లిమిటెడ్ (జీపీఎల్) లో 58 శాతం వాటాను రూ. 3,604 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్ మంగళవారం ప్రకటించింది. డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటా కోసం ఒప్పందం ఖరారు అయినట్టు కంపెనీ తెలిపింది. దీంతో గంగవరం పోర్ట్‌లో అదానీ వాటా మొత్తం 89.6 శాతానికి చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో అదానీ సంస్థ జీపీఎల్‌లో వార్బర్గ్ పింకస్‌కు చెందిన 31.5 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ. 1,954 కోట్లు. విశాఖ సమీపంలో ఉన్న ఈ పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే రెండో అతిపెద్ద నాన్-మేజర్ పోర్టుగా ఉంది.

ఇనుప ఖనిజం, ఉక్కు, సున్నపుతాయి, చక్కెర, బొగ్గు, ఎరువులు, బాక్సైట్, అల్యూమినియంతో సహా అనేక రకాల పొడి, భారీ వస్తువుల ఎగుమతులు, దిగుమతులను ఈ పోర్టు నిర్వహిస్తోంది. అన్ని రకాల ఋతువులలో సరుకు రవాణా కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా ఈ పోర్టు ఉంటుంది. అత్యధిక లోతైన పోర్టు కావడంతో 2 లక్షల అత్యంత భారీ సామర్థ్యం ఉన్న ఓడలు సైతం ఈ పోర్టుకు వచ్చి వెళ్తుంటాయి. సుమారు 1,800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులుగా ఉంది. దేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరుకు రవాణా జరుగుతోంది. తాజా ఒప్పందంతో అదానీ గ్రూప్ సంస్థ వాటా 89.6 శాతానికి చేరుకోగా, మిగిలిన 10.4 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిగి ఉంది.

Advertisement

Next Story

Most Viewed