మా టీకాలను యాక్సెప్ట్ చేయండి… లేదంటే…

by Shamantha N |
మా టీకాలను యాక్సెప్ట్ చేయండి… లేదంటే…
X

న్యూఢిల్లీ: భారత టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లను వ్యాక్సినేషన్ పాస్‌పోర్టు లేదా గ్రీన్ పాస్‌పోర్టు కోసం యూరప్ దేశాలు పరిగణించకపోవడం చర్చనీయాంశమైంది. తమ టీకాలను గ్రీన్ పాస్‌పోర్టు కోసం అంగీకరించాలని, తద్వారా కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయులను యూరోపియన్ యూనియన్ దేశాలకు అనుమతించాలని కోరినట్టు భారత విదేశాంగ వర్గాలు తెలిపాయి. ఈయూలోని దేశాలు వేటికవిగా ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపినట్టు వివరించాయి. కొవిన్ పోర్టల్‌లో జనరేట్ అయిన కొవిడ్ టీకా సర్టిఫికేట్‌ను పరిగణించాలని సూచించినట్టు వివరించాయి.

అలా చేస్తే ఈయూ దేశాల నుంచి టీకా పొందిన పౌరులకు తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయిస్తామని ప్రతిపాదించినట్టు వెల్లడించాయి. లేదంటే ఈయూ ప్రవేశపెడుతున్న గ్రీన్ పాస్‌పోర్టులను లేదా వారి టీకా సర్టిఫికేట్‌లనూ భారత్ యాక్సెప్ట్ చేయదని, టీకా వేసుకున్న యూరోపియన్ పౌరులు భారత్‌లోకి వస్తే తప్పనిసరిగా నిర్దేశిత సమయం క్వారంటైన్‌లో ఉంచుతామని హెచ్చిరించినట్టు పేర్కొన్నాయి. ఐరోపా సమాఖ్య దేశాలు భారత కొవిన్ పోర్టల్ ఇష్యూ చేసే టీకా సర్టిఫికేట్‌ను పరిగణించి ధ్రువీకరిస్తే అదే రీతిలో ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్‌లకూ విలువనిస్తుందని తెలిపినట్టు చెప్పాయి.

ఈయూలోని 27 దేశాల మధ్య గ్రీన్ పాస్‌పోర్టు ఒప్పందం కుదిరింది. గురువారం నుంచి అమల్లోకి రానుంది. ఈయూ మెడికల్ ఏజెన్సీ ఆమోదించిన ఫైజర్, మొడెర్నా, ఆస్ట్రా జెనెకా, జాన్సెన్ టీకా వేసుకున్న వారు ఈ సమాఖ్య సభ్యదేశాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా పర్యటించవచ్చు. ఆస్ట్రా జెనెకా ఇండియన్ వర్షన్ కొవిషీల్డ్(సీరం ఉత్పత్తి చేసిన టీకా) ఈయూ మెడికల్ ఏజెన్సీ అనుమతి పొందాల్సి ఉన్నది. మరో నెలలో తమకు అనుమతి లభిస్తుందని సీరం ఇన్‌స్టిట్యూ్ట్ సీఈవో అదర్ పూనావాలా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed