కేసీఆర్ ఢిల్లీ టూర్.. మొదటి రౌండ్ చర్చలు షురూ

by Anukaran |
కేసీఆర్ ఢిల్లీ టూర్.. మొదటి రౌండ్ చర్చలు షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న యాసంగి సీజన్‌కు తెలంగాణలో పండే వరి ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయడంపై తాడో, పేడో తేల్చకుంటానని ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ లైట్‌గా యాక్షన్ మొదలుపెట్టారు. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ కార్యదర్శి సుధాంశు పాండేతో రాష్ట్ర అధికారులు సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. తొలి దఫా చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రతీ యాసంగి సీజన్‌కు ఎంత విస్తీర్ణంలో రైతులు వరి పంటను సాగు చేస్తారో, దాని నుంచి సగటున ఎంత ధాన్యం ఉత్పత్తి అవుతుందో, రాష్ట్రంలోని పౌర సరఫరాల దుకాణాల ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎంత సప్లయ్ అవుతుందో.. తదితర వివరాలన్నింటినీ కేంద్ర కార్యదర్శికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ,తదితరులు ఉన్నారు.

యాసంగి సీజన్‌లో ఎఫ్‌సీఐ పూర్తిగా ధాన్యాన్ని సేకరించాలన్న ఆలోచన లేదని ఇప్పటికే రాష్ట్రానికి సమాచారం అందింది. దీనికి అనుగుణంగా రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం వరి పంటనే పండించాలని కామెంట్ చేశారు. దీంతో రాష్ట్రంలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించే ఉద్దేశంతో ఎంత పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్నదో, ఎఫ్‌సీఐ ఏ మేరకు సిద్దపడుతుంది తదితరాలపై సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో తేల్చాలనుకున్నారు. మొదటి ప్రయత్నంగా అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. రాత్రి కేంద్ర మంత్రితో జరిగే భేటీలో మరికొంత క్లారిటీ రానున్నది.

Advertisement

Next Story

Most Viewed