ఉడుంపూర్‌లో ఉద్రిక్తత.. అటవీ కార్యాలయంపై దాడి

by Aamani |   ( Updated:2020-05-05 08:50:52.0  )
ఉడుంపూర్‌లో ఉద్రిక్తత.. అటవీ కార్యాలయంపై దాడి
X

దిశ, ఆదిలాబాద్: అటవీ సిబ్బంది విచక్షణారహితంగా కొట్టడం వల్ల తమ గ్రామానికి చెందిన వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంపై గండిగోపాల్‌‌పూర్ గ్రామస్తులు మంగళవారం దాడి చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధి గండిగోపాల్‌పూర్ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి నిప్పు రాజుకుంది. ఇందుకు మేకల కాపరి గాదె నర్సయ్య కారణమంటూ అటవీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పూచీకత్తుపై అతన్ని సర్పంచ్, గ్రామస్తులు విడిపించుకుపోయారు. విచారణ సమయంలో నర్సయ్యను సిబ్బంది కొట్టినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం నర్సయ్య అనారోగ్యానికి గురయ్యారు. బంధువులు, గ్రామస్తులు కలిసి చికిత్స కోసం ఉట్నూరుకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందారు. అటవీ సిబ్బంది కొట్టిన దెబ్బలకు తాళలేక నర్సయ్య మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు, గండిగోపాల్‌పూర్ గ్రామస్తులు కడెంకు చేరుకున్నారు. ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. రికార్డులను చించివేశారు. కార్యాలయం ఆవరణలోని ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామస్తులు దాడి చేసిన సమయంలో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరని సమాచారం. పోలీసులు అటవీ రేంజ్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మా సిబ్బంది దాడి చేయలేదు

కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియా పరిధిలో అడవికి నష్టం కలిగిస్తూ నర్సయ్య చెట్లకు నిప్పు పెడుతుండగా తమ సిబ్బంది గమనించి అదుపులోకి తీసుకున్నారని ఆదిలాబాద్ అటవీ సర్కిల్ ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో కూడా అతను ఇలాగే వ్యవహరించినప్పుడు హెచ్చరించి వదిలేశామని, మళ్లీ అదే తప్పు చేయడంతో తమ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారని తెలిపారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త కుర్రా లక్ష్మణ్, ఉప సర్పంచ్ దొంతుల శ్రవణ్ కుమార్, గ్రామస్తులు విచారణకు సహకరిస్తామని పూచీకత్తుపై సంతకం చేసి సోమవారమే అతన్ని తీసుకెళ్లారని చెప్పారు. నర్సయ్య మృతికి, తమ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని, అటవీ సిబ్బంది ఎవరూ నర్సయ్యపై దాడి చేయలేదని స్పష్టం చేశారు.

Tags: Adilabad, Kadem range, Aboriginal people, Attack

Advertisement

Next Story

Most Viewed