విధి ఆడిన ఓ వింత నాటకంలో టిక్ టాక్ ముఖ్య పాత్ర

by Sridhar Babu |   ( Updated:2020-05-24 03:47:18.0  )
విధి ఆడిన ఓ వింత నాటకంలో టిక్ టాక్ ముఖ్య పాత్ర
X

దిశ‌, ఖ‌మ్మం: ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు సంవత్సరాలపాటు వెతకని చోటూ లేదు. కానీ, అతడి ఆచూకీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలా అతడి కుటుంబం బాధలోనే ఉండిపోయింది. కానీ, అనుకోకుండా ఒకరోజు టిక్ టాక్ రూపంలో వారికి ఆనందం ఎదురైంది. ఆ వివరాల్లేంటో మీరే చూడండి.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టీ నగర్ గ్రామానికి చెందిన మూగ, చెవిటి అయిన వెంకటేశ్వర్లు రెండు సంవత్సరాల క్రితం పెళ్లికి వెళ్లి తప్పిపోయాడు. దీంతో అతని కుటుంబ స‌భ్యులు తెలిసిన చోట‌ల్లా వెతికినా ఫ‌లితం లేకుండాపోయింది. వెంక‌టేశ్వ‌ర్లు కోసం కుటుంబ స‌భ్యులు రెండు సంవ‌త్స‌రాలుగా ఏడ‌వ‌ని రోజు లేదు. విధి ఆడే వింత నాట‌కంలో అన్న‌ట్లుగా వారం రోజుల క్రితం పిన‌పాక ప‌ట్టీన‌గ‌ర్ గ్రామానికి చెందిన యువకుడు టిక్ టాక్ చూస్తుండగా ఓ వీడియోలో వెంకటేశ్వర్లు కనిపించాడు. అతడిని గుర్తుప‌ట్ట‌డంతో వెంట‌నే కుటుంబ స‌భ్యుల‌కు తెలిపాడు. ఆ కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వీడియోను టిక్ టాక్ పోస్ట్ చేసిన ఐడీ ద్వారా విచార‌ణ చేప‌ట్టారు. వెంక‌టేశ్వ‌ర్లు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాడని నిర్ధారించుకున్నారు. జిల్లా పోలీస్‌శాఖ అంద‌జేసిన రోడ్డు పాస్ ద్వారా కుటుంబ స‌భ్యులు పంజాబ్‌లోని వెంక‌టేశ్వ‌ర్లు ఉన్న ప్రాంతానికి ఆదివారం చేరుకున్నారు. అక్క‌డి పోలీసుల‌కు, స్థానికుల‌కు వెంక‌టేశ్వ‌ర్లు కుటుంబ‌స‌భ్యులు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసి తిరుగుప‌య‌న‌మ‌య్యారు.

Advertisement

Next Story