బీఆర్ఎస్ శకం ముగిసింది.. గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేదు

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్ శకం ముగిసింది.. గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిందని, పదేండ్ల గొప్పలు చెప్పుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపించారని, ఇక అది ‘నిన్నటి పార్టీ’గానే ఉండిపోతుందని బీజేపీ సికింధ్రాబాద్ అభ్యర్థి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని, అది గెలిచినా ఓడినా ప్రయోజనమేమీ లేదన్నారు. కాంగ్రెస్ సైతం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచిందని, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. బీజేపీ ఎంపీగా ఐదేండ్ల ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచానని, అవినీతి మచ్చ లేకుండా నైతిక విలువలతో బతికానని, చివరి శ్వాస వరకూ ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ‘సంకల్ప సభ’లో ఆయన మాట్లాడుతూ, సికింద్రాబాద్‌లో మరోసారి బీజేపీ జెండాదే గెలుపు అని వ్యాఖ్యానించారు.

అంబర్పేట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడు సార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించానని గుర్తుచేసిన ఆయన నిబద్ధత కలిగిన ప్రజాప్రతినిధిగా వ్యవహరించానని, సికింద్రాబాద్ ఎంపీగా ప్రజల దీవెనతో గెలిచి ఐదేండ్ల తన ప్రోగ్రెస్ రిపోర్టును వారి ముందే ఉంచానని గుర్తుచేశారు. ఏనాడూ ప్రజలు తలదించుకునే విధంగా వ్యవహరించలేదని, ఇకపైన కూడా అదే తీరులో ఉంటానంటూ సికింద్రాబాద్ ప్రజానీకానికి మాట ఇస్తున్నానని నొక్కిచెప్పిన కిషన్‌రెడ్డి... మరోసారి గెలిపించాలని కోరారు. ఇప్పటివరకూ అక్రమాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, బెదిరింపులు, అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు వివిద హోదాల్లో సేవ చేశానని, భవిష్యత్తులోనూ ఇదే కమిట్‌మెంట్‌తో పని చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో మూడుసార్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన తాను ఇప్పుడు నాల్గవసారి అదే బాధ్యతలు నిర్వహిస్తున్నానని, పార్టీ లేకుండా వ్యక్తిగా కిషన్‌రెడ్డి లేడని అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను ఓట్ల రూపంలోనే చూశాయని, ప్రజాధనాన్ని లూటీ చేసి అవినీతి చేసిన బీఆర్ఎస్‌కు, ప్రజలను రకరకాల వాగ్ధానాలతో ముంచెత్తి వారికి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు తేడా లేదని, ఓట్లు అడిగే నైతిక అర్హత ఆ రెండు పార్టీలకూ లేదన్నారు. గ్యారంటీలో, గారడీలో రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ బదులివ్వాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలూ బీజేపీ కైవశం అవుతాయని, ప్రజలు మాయ మాటలకు లొంగే రోజులు పోయాయని, ఇప్పుడు అభివృద్ధి, నిఖార్సయిన పార్టీలవైపు చూస్తున్నారని అన్నారు. కిషన్‌రెడ్డికి ఆరాటమెక్కువని, ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తారని, సికింద్రాబాద్ ప్రజలు కూడా చైతన్యానికి, మేధస్సుకు మారు పేరు అని అన్నారు.

Also Read...

కేసీఆర్ బయటకు వస్తే మా అస్త్రాలను బయటకు తీస్తాం.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story