ఆ పాపం నేను చేయను.. రాజ్యాంగం మార్పు వార్తలపై ప్రధాని షాకింగ్ రియాక్షన్

by GSrikanth |
ఆ పాపం నేను చేయను.. రాజ్యాంగం మార్పు వార్తలపై ప్రధాని షాకింగ్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో బీజేపీ మరోసారి గెలిస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు తరచూ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పలుచోట్ల ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా.. రాజ్యాంగం మార్పు వార్తలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. గురువారం పలువురు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాక్ స్వాతంత్ర్యాన్ని కాంగ్రెస్ హరించిందని గుర్తుచేశారు. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది.. దీంతో దేశానికి తీవ్రనష్టం జరుగుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కానివ్వం అని ప్రకటించారు. ముస్లింలీగ్ ప్రేరణతోనే కాంగ్రెస్ మేనిఫెస్టోను తయారు చేశారని విమర్శించారు. తనను తిట్టేందుకు విపక్షాలకు తిట్లన్నీ అయిపోయాయని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలంటే పెద్ద తపస్సు చేయాలని సెటైర్ వేశారు. హామీలు చూసి ప్రజల్లో ఆ పార్టీ నేతలు నమ్మకం కోల్పోతున్నారని అన్నారు. నకిలీ వస్తువులు అమ్మేవారే బాగా ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఆ నమ్మకమే 2024లో గ్యారంటీగా మారిపోయిందని తెలిపారు. ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో తనకు తెలుసని.. అందుకే అమలుకు సాధ్యమయ్యేవే హామీలుగా ఇచ్చామని అన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థితికి వచ్చానని తెలిపారు. తెలంగాణలోనూ తమకు మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు.. అదే బాటలో రేవంత్ ప్రయాణిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చే పాపం తాను చేయబోను అని ప్రధాని కీలక ప్రకటన చేశారు. తరచూ ఇష్టానుసారం రాజ్యాంగాన్ని సవరించిన ఘనత కాంగ్రెస్‌దే అని విమర్శించారు. ఏనాడూ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని గౌరవించలేదని అన్నారు.

Advertisement

Next Story